నారాయణపేట రూరల్, మే 24 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి తమ భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్ హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే వారి పేర్లను గ్రామసభలో అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. అధికారులకు తమ గోడువెల్లబోసుకున్నారు.
భూములు కోల్పోయే వారంతా చిన్న, సన్నకారు రైతులేనని, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామని తెలిపారు. భూములు కోల్పోతే బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన చెందారు. ‘ఇదే విషయాన్ని గతంలో వచ్చిన అధికారులకు సైతం చెప్పాం.. ఇప్పుడు మళ్లా మీరొచ్చారు.. మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. భూముల విషయంలో మరోసారి ఆలోచించాలని అధికారులను కోరారు.
భూములైతే ప్రాజెక్టుకు ఇవ్వబోమని చెప్పడంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. అంతకుముందు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కొడంగల్ లిఫ్ట్‌తో లక్షా నలభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూత్పూరు రిజర్వాయర్ నుంచి ఊట్కూరు పెద్ద చెరువు, పేరపళ్ల జాయమ్మ చెరువులకు నీటిని తరలించి పంప్‌హౌస్‌ల ద్వారా ఓపెన్ కెనాల్ పైపులైన్ నిర్మాణంతో దౌల్తాబాద్, కొడంగల్ ప్రాంతాలకు సాగునీటిని అందించనున్నట్టు చెప్పారు.