Telangana | హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని అందరూ భావించారు. అయితే, అలాంటిదేమీ లేదని సీఎం ప్రకటనతో తేటతెల్లమైంది. ఫార్మా సిటీ అయినా, ఇండస్ట్రియల్ కారిడార్ అయినా భూసేకరణ మాత్రం తప్పదని రేవంత్‌రెడ్డి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లోనూ ఫార్మా కంపెనీలకు చోటు లభించే అవకాశం లేకపోలేదు. దీంతో రైతుల మెడపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది. లగచర్ల ప్రాంతంలో సుమారు 1100 ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన విషయం విదితమే. దీనిపై రైతుల నుంచి వెల్లువెత్తిన ప్రతిఘటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. కాంగ్రెస్ అధిష్ఠానానికి బాధితుల ఫిర్యాదు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం తదితర పరిణామాలతో భూసేకరణపై రాష్ట్రం వెనకడుగు వేసినట్టు సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో సీఎం తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఫార్మా పరిశ్రమ అయినా, మరే ఇతర పరిశ్రమ అయినా రైతుల నుంచి భూసేకరణ చేయక తప్పదు. లగచర్లలో రైతులు చేస్తున్న పోరాటం కూడా భూసేకరణకు వ్యతిరేకంగానే. ఇప్పుడు ఫార్మాసిటీ పేరు మార్చి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పినా భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. తమకు బతుకునిచ్చే పచ్చని పంట పొలాలను దేని కోసమైనా సరే వదులుకునేది లేదని రైతు లు తెగేసి చెప్తున్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్‌లోనూ ఫార్మా పరిశ్రమలకు చోటు ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ అక్కడ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తే మాత్రం కాలుష్యకారక పరిశ్రమలకు చోటుండదు. అంతేతప్ప, ఫార్మా కంపెనీలను నిషేధించినట్టు కాదు. ఫార్మా కంపెనీల వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం అవుతాయి. జీడిమెట్ల, బలానగర్ తదితర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రాత్రివేళల్లో వ్యర్థ జలాలను సమీపంలోని నాలాలు, నిర్జన ప్రాంతాల్లో వదిలిపెడుతున్న వార్తలు తరచూ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో లగచర్ల ప్రాంతంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ కారిడార్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. లగచర్ల ప్రాంతంలో సీలింగ్ భూములు ఉన్నాయని, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం వాటిని ఉపయోగించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక్కడి సీలింగ్ భూముల్లో చాలా వాటిని క్రమబద్ధీకరించగా, మరికొన్నింటిపై కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీలింగ్ భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏ ర్పాటు కష్టమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు దాఖలైతే అవి తేలేందుకు సంవత్సరాలు పడుతుంది. ట్రిపుల్ ఆర్తోపాటు గతం లో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూ ముల విషయంలోనూ ఇదే జరుగుతున్నది.అవి ఇప్పటికీ ప్రచారానికి నోచుకోలేదు. భూసేకరణ చట్టం ప్రకారం బలవంతంగా లాక్కునే అవకాశం లేదు. ప్రభు త్వం ఒకవేళ బలవంతంగా భూసేకరణ చేపడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.