జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : ‘మున్సిపాలిటోళ్లు నా బర్ల కొట్టం కూలగొట్టారు.. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెబితేనే కూలగొట్టామని చెప్పారు. దీంతో నా 20 బర్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెసోళ్లు వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు. షెడ్డు నిర్మించి, భూమి రిజిష్ర్టేషన్ చేయిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. 20 రోజులు తిప్పుకుని ఇప్పుడు మొండి చేయి చూపిస్త్తుండు’ అని బాధితురాలు కూరాకుల లలిత ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌లోని తన ఇంటి వద్ద బాధితురాలు లలిత తన భర్త ఓదెలు, కుమారుడు కల్యాణ్, సోదరుడు రమేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
187 సర్వే నంబర్లో ఉన్న తమ 20 గుంటల భూమిని మాదయ్య, సారయ్య, గోపాల్‌రావు, మల్హర్రావు ఆక్రమించారని పేర్కొన్నారు. కుమారుడు ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికారుల చుట్టూ తిరగడంతో రూ.70 లక్షల వరకు అప్పుల పాలై చివరికి ఆ భూమినే వదిలేసుకున్నానని తెలిపింది. ఇప్పుడు 187 సర్వే నంబర్లో ఉన్న 8 గుంటల భూమిని సైతం ఆక్రమించుకోవాలని బర్ల కొట్టంను మున్సిపాలిటీ అధికారులు నెల క్రితం కూలగొట్టారని, ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే చెబితేనే చేశామని టీపీవో సునీల్ చెప్పిండని పేర్కొంది. దీంతో తన బర్లను సమీపంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారని చెప్పారు.
ఈ సందర్భంగా షెడ్డు నిర్మించి, భూమి రిజిష్ర్టేషన్ చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటి వరకు హామీ నెరవేర్చకపోగా చివరికి బీఆర్ఎస్ నాయకులు చెబితేనే బర్లు తోలానని, నలుగురు బీఆర్ఎస్ పెద్ద లీడర్ల పేర్లు విలేకరులతో చెబితే న్యాయం చేసే విషయాన్ని ఆలోచిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారని వెల్లడించింది. ఎమ్మెల్యేతోపాటు మాదయ్య, సారయ్య, గోపాల్‌రావు, మల్హర్రావుతో ప్రాణహాని ఉందని ఆరోపించింది. షెడ్డు కూలగొట్టించి, బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పాలని ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడింది.