యాదాద్రి : ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గురువారం యాదగిరిగుట్టలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాపర్వాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చనను పంచరాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు నిర్వహించారు. స్వామివారికి నిత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారిని 9,645 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఖజానాకు రూ.21,57,687 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్ గీత తెలిపారు.