హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఒక సంఘటన.. కానీ రెండు కేసులు.. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్‌పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం! వాళ్లేదో దొంగలు కాదు.. ఉగ్రవాదులు అంతకన్నాకాదు. తమ భూమిని సర్కారు గుంజుకుంటే కడుపుమండి తిరగబడిన రైతులు. వికారాబాద్ జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్లలో రెండు నెలల క్రితం అధికారులపై జరిగిన దాడిలో పోలీసులు పలువురు గ్రామస్థులపై కేసులు నమోదుచేశారు. ఈ కేసుల్లో రెండోసారి జైలుకు వెళ్లిన నలుగురు రైతులు హైకోర్టు ఆదేశం మేరకు రూ. 25 వేల పూచీకత్తుపై మంగళవారం విడుదలయ్యారు.
లగచర్లలో నవంబర్ 11న అధికారులపై జరిగిన దాడికి సంబంధించి బొమ్రాస్పేట పోలీసులు 27 మందిని రిమాండ్‌కు పంపారు. వీరిలో కొంతమందికి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలినవారిలో రమేశ్, గోపాల్‌నాయక్, మాదరయ్య, మంగ్యానాయక్ అనే నలుగురు రైతులకు ఈ నెల 8న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరు సంగారెడ్డి జైలునుంచి విడుదలయ్యారు. కానీ పోలీసులు వీరిపై క్రైం నంబర్లు 154, 155పై కూడా కేసులు ఉన్నాయంటూ వెంటనే అరెస్టు చేశారు. దీంతో రైతులు మళ్లీ సంగారెడ్డి జైలులోనే ఉండాల్సి వచ్చింది.
మళ్లీ అరెస్టు అయిన రైతులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అదే ఘటనకు చెందిన మరో కేసులో మళ్లీ అరెస్టు చేశారని తెలిపారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. లగచర్ల గ్రామస్థులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వాదనలను, రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. గ్రామస్థులు ఇచ్చిన వాంగ్మూలాల్లో పిటిషనర్ల పేరు తప్ప మరేమీ ప్రత్యేకంగా కనించడంలేదని తప్పు పట్టింది.
నేరాల్లో కూడా వారి పాత్ర గురించి ఏమీ లేదని చెప్పింది. నవంబర్ 16 నుంచి జనరవి 8 వరకు తిరిగి 9 నుంచి జైలులోనే ఉన్నారని, ఒకే సంఘటనపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేయడాన్ని, ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో సవాల్ చేసి ఉత్వర్లు పొందారని గుర్తుచేసింది. ఒక ఘటనపై వేర్వేరు కేసులను ఒకటిగా పరిగణించాలని పట్నం కేసులో ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పింది. ఒక కేసును కొనసాగించి మిగిలిన కేసుల్లో ఇచ్చిన ఫిర్యాదులను వాంగ్మూలాలుగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపింది.
తమ ముందున్న కేసులో జైలుకు వెళ్లిన వాళ్లు రైతులని గుర్తుచేసింది. ఒక కేసులో బెయిల్ మంజూరు చేశాక..నిందితులు విడుదలైన తర్వాత మిగిలిన కేసుల్లో అరెస్ట్ చేసిన వైనాన్ని లోతుగా పరిశీలిస్తామని ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వేసింది. పిటిషనర్లు నలుగురి నుంచి రూ.25వేల చొప్పున వ్యక్తిగత పూచికత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.