‘ఈ జిల్లాకు నిధులు ఇచ్చేందుకు మంత్రులంతా సంతకం పెట్టే ముందు మన సప్పట్లు వాళ్లకు వినిపించాలె. కొట్టుండ్రి చప్పట్లు బాగా. మీ సప్పట్లే వాళ్లకు విజ్ఞప్తులు. డప్పు సప్పుడు గట్టిగా వినిపించాలె. మన జిల్లానే మాదిగోళ్ల జిల్లానయా..కొట్టుర్రి గట్టిగ’
– సీఎం రేవంత్
CM Revanth Reddy | మహబూబ్నగగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందేని, భూమితో మనకు ఎంతో అనుబంధం ఉన్నా, అభివృద్ధి కోసం భూ సేకరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కరాఖండిగా చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవసరమైతే ఎకరాకు రూ.10 లక్షలు కాకుండా రూ.20 లక్షల నష్టపరిహారం ఇచ్చయినా భూమి సేకరించి పరిశ్రమలు పెట్టాలని తాను ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇయ్యాల మీరు అండగా నిలబడితే రూ.పది ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉన్నది.. నేను సంతకం పెడితే పది లక్షలు కాదు.. ఎకరాకు 20 లక్షలు ఇచ్చే శక్తి నాకున్నది.. తీసుకోండి 20 లక్షలు.. ఇచ్చే బాధ్యత నాది. ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత కూడా మాదే.
మీ ఇంట్లో చదువుకున్నోళ్లకు, చదువుకోనోళ్లకు ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి. మాయ మాటలు వినకండి. వాళ్ల ఉచ్చులో పడకండి. ఒకవేళ ఉచ్చులో పడి జైళ్లకు పోతే మన కుటుంబాలు ఆగమయితయి. ఇయ్యాల పది ఎక్కువ తీసుకొని పక్కకుపోయి భూములు కొనుక్కోండి. ఉద్యోగం తీసుకోండి. మీ కుటుంబాలను బాగుపర్చుకోండి’ అంటూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోయి పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా.. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా.. అది నా జిమ్మేదారి’ అంటూ ఊగిపోయారు.
‘నన్ను మారుమూల ప్రాంతమైన కొడంగల్ నుంచి ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే.. 1300 ఎకరాలు సేకరించి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20 వేలో.. 30 వేలో.. మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, నా ప్రాంతం అభివృద్ధి చెందుతదని, నా జన్మ ధన్యమవుతదని ఒక ప్రయత్నం చేసిన. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాల భూమి ఉన్నది. కొడంగల్లో 1300 ఎకరాల భూమి సేకరించి పారిశ్రామిక వాడను నిర్మించి అభివృద్ధి చేయాలనుకుంటే చిచ్చుపెట్టి లగచర్ల మంటలు పెట్టి, అధికారులను కొట్టించి, కలెక్టర్ మీద దాడి చేయించి, మా లంబాడీ సోదరులను జైలుపాలు చేసిండ్రు. నేను ఆయాలనే చెప్పిన, వాళ్ల మాయమాటలు నమ్మొద్దని. సార్ మీరే సీఎం కదా మా మీద కేసులు ఎత్తేయాలని అడుగుతున్నరు.. నేను చెప్పిన మా మిత్రులకు.. సోదరులకు, ముఖ్యమంత్రిగా ఉన్న నామీదనే 182 కేసులు ఉన్నాయి.. నా కేసులే నేను తీసుకోలేకపోయిన.. చట్టం వేరు.. ముఖ్యమంత్రి కుర్సీ వేరు’ అని చెప్పి తానేమీ చేయలేనని చెప్పకనే చెప్పారు.
‘నేను అడగదలుచుకున్న.. మీ భూములను తీస్కొని నేనేమైనా సాపల సుట్టుకొని పోతనా? నాకేం అవసరం ఉన్నది? ఇయాల 1300 ఎకరాల భూములు తీసుకుంటే నేనేం పట్నం తీస్కపోతనా?’ అంటూ ప్రశ్నించారు. ‘ఆనాడు నాగార్జునసాగర్ కట్టేటప్పుడు మునుగలేదా.. శ్రీశైలం కట్టేటప్పుడు మా కొల్లాపూర్ మునుగలేదా? పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కడుతుంటే కొల్లాపూరోళ్లు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు భూములు కోల్పోయిన బాధను దిగమింగి ప్రభుత్వ సాయం అందించాలని కోరిండ్రు గాని అడ్డుపడలేదు.. ఆ రోజే కొట్టాలనుకుంటే మా బిడ్డలు కొట్టకపోతుంటిరా? అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండెనా? నాగార్జునసాగర్ వస్తుండెనా? జూరాల అయితుండైనా? ఒకవేళ అనుకుంటే నడిగడ్డ మీద ఎవరైనా భూసేకరణ చేస్తుండెనా?’ అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే.. ఈ జిల్లాలో పరిశ్రమలు తేకపోతే.. ఈ జిల్లాకు నీళ్లు, నిధులు ఇవ్వకపోతే.. చరిత్ర నన్ను క్షమిస్తుందా?’ అంటూ అసహనం వ్యక్తంచేశారు.
సభలో కుర్చీలాటను చూసి సభికులు నవ్వుకున్నారు. నిర్వాహకులు సీఎంకు, మంత్రులకు, ముఖ్య నేతలకు మాత్రమే మొదటి వరుసలో కుర్చీలు కేటాయించారు. చాలా మంది ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేయలేదు.
సీఎం సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పండుగలో కూడా రేవంత్రెడ్డి 18 సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ప్రతి దానికీ కేసీఆర్ను అడ్డం పెడుతూ మాట్లాడడంతో జనం పెదవివిరుచుకోవడం కనిపించింది.
రేవంత్రెడ్డి మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోవడం కనిపించింది. అప్పటివరకు రైతుల గురించి.. రైతు రుణమాఫీ, రైతు బీమా, పంట బోనస్ గురించి మాట్లాడిన సీఎం, జనం వెళ్లిపోవడం చూసి కేసీఆర్పై తిట్ల పురాణం అందుకున్నారు. అయినా వాళ్లు ఆగకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
‘మీ సప్పట్లే వాళ్లకు విజ్ఞప్తి. ఎందుకంటే 70 ఏండ్ల ఆకాంక్ష. ఈ జిల్లాకు నిధులు ఇచ్చేందుకు మంత్రులంతా సంతకం పెట్టే ముందు మన సప్పట్లు వాళ్లకు వినిపించాలె. కొట్టుండ్రి చప్పట్లు బాగా. డప్పు సప్పుడు గట్టిగా వినిపించాలె. మన జిల్లానే మాదిగోళ్ల జిల్లా నయా.. కొట్టుర్రిగట్టిగ’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చివర్లో చప్పట్లు కొట్టించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, ఈ ఐదేండ్లలో లక్ష కోట్లు ఇచ్చి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని వేదిక మీద ఉన్న మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేసి ఆ తర్వాత ఇలా జనంతో చప్పట్లు కొట్టించారు.
రైతు పండుగ సభలో మాదిగోళ్లు డప్పు గట్టిగ కొట్టుర్రి అని మాట్లాడి సీఎం రేవంత్రెడ్డి తమను అవమానపరిచాడని పలువురు దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. మాదిగోళ్లు అంటే కేవలం డప్పు కొట్టేవాళ్లేనా అని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం స్థాయిలో ఉండి దళితులను కించపరిచేలా మాట్లాడటమేమిటని మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ పలు సభలు, సమావేశాల్లో ఐదెకరాల భూమి ఉంటేనే రెడ్డిల మాట వింటరని ఉన్నత వర్గాలకు వత్తాసు పలికారని, ఇప్పుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడారని, ఇలా తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం భావ్యం కాదని, మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, కేవీపీఎస్, దండోరా నాయకులు వెల్లడించారు. సీఎం అహంకార పూరిత మాటలు దళితులను మరింత అఘాతంలోకి నెట్టేసేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు సైతం ఖండించారు.