సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై అరెస్టయిన రైతులు విడుదలయ్యారు. 37 రోజులుగా సంగారెడ్డి జిల్లా కంది జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు శుక్రవారం ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. నవంబర్ 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఐదు గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టు చేశారు.
అయితే ఇదే కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ నెల 18న బెయిల్ మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో రైతులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు బయట రైతులకు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ సహా మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.