Lagacharla | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన లగచర్ల రైతులు దాదాపు 34 రోజులుగా జైలులోనే మగ్గుతున్నారు. బెయిల్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ప్రముఖుల విషయంలో గంటల వ్యవధిలోనే లభిస్తున్న బెయిలు వీరి విషయానికి వచ్చేసరికి ఆలస్యం అవుతుండటం వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసమంటూ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో భూసేకరణ చేపట్టింది. తమకు జీవనాధారం లేకుండా పోతున్నదని ఆందోళన చెందుతూ లగచర్ల గ్రామానికి చెందిన 24మంది రైతులు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. బలవంతపు భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా అదుపు తప్పడం, వాహనాల ధ్వంసం వరకు వెళ్లడం తెలిసిందే. లగచర్ల సంఘటనలో ఎవరికీ చిన్నపాటి గాయాలు కూడా కాలేదు. అయినప్పటికీ ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా దాదాపు 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా 34రోజులుగా జైలులోనే మగ్గిపోతున్నారు. సదరు రైతుల బెయిల్ పిటిషన్లు ఏదో కారణంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. భూములు ఇవ్వకుండా అడ్డం పడటం, భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి రావడంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.
దీనిని మనసులో పెట్టుకున్న ప్రభుత్వం ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నదని, ఈ కారణంగా వారి బెయిలు విషయంలో అంత శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు బెయిలు పిటిషన్లు వేసిన ప్రతిసారి ప్రభుత్వం ఏదో ఒకసాకు చూపుతుండటంతో వారి పిటిషన్లు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కుంటిసాకుల ముందు నిందితుల బెయిలు హక్కు ఓడిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటనకు బాధ్యుడు అంటూ సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. అదే రోజున కోర్టులో విచారణ జరగడం, రిమాండ్ విధించడం, ఆ వెంటనే హైకోర్టులో బెయిలు మంజూరు కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడీ ఘటనను లగచర్ల రైతుల ఘటనతో ముడిపెడుతూ నెటిజన్లు విపరీత చర్చకు తెరతీశారు.
అల్లు అర్జున్ బెయిలు విషయంలో వ్యతిరేకించని ప్రభుత్వ న్యాయవాదులు.. లగచర్ల రైతుల విషయంలో మాత్రం అడ్డుతగులుతూ, వారిని బయటకు రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ‘బెయిల్ ఈజ్ రూల్.. జైల్ ఈజ్ ఎక్సెప్షన్’ (బెయిలు అనేది నియమం.. జైలు అనేది మినహాయింపు) అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. మరో నటుడు బహిరంగంగానే దాడిచేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, లగచర్ల విషయంలో తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పినా ప్రభుత్వం అత్యుత్సాహంతో అన్నదాతలను అరెస్ట్ చేసి జైలుకు పంపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటుడికి లభించినంత త్వరగా లగచర్ల రైతులకు బెయిల్ రాకపోవడం వెనక ప్రభుత్వ కుట్ర, నిర్లక్ష్యమే కారణమని నెటిజన్లు, తెలంగాణ మేధావులు సోషల్‌మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న తీరుతోనే లగచర్ల రైతులకు బెయిల్ లభించడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో వందలాది మంది పోలీసులు, వందలాది ప్రభు త్వ ఉద్యోగులు జెట్స్పీడుతో పనిచేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
వ్యవసాయ భూముల కోసం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను 34 రోజులుగా జైలులో పెట్టి, కావాలనే అనేక సాకులు చూపుతూ బెయిల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్నదని, సర్కారు ఆదేశాలతో అధికార యంత్రా ంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు వారిపై చార్జిషీట్ కూడా దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు వాయిదా పడుతున్నాయని వివరిస్తున్నారు.
ఉద్దేశపూర్వక జాప్య ంతో వీలైనంత వరకు వారిని జైలులో ఉంచాలని ప్రభు త్వం కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లు అర్జున్‌కి ఇచ్చిన సమయంలో సగం సమయమిచ్చి నా రైతులకు బెయిల్ ఎప్పుడో వచ్చేదని చెప్తున్నారు. ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణమని నిప్పులు చెరుగుతున్నారు. అల్లు అర్జున్‌కు ఒకే.. మరి లగచర్ల రైతులకు ఎప్పుడు విడుదల అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.