Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘మీరేం చేయాలని నేను అడుగుతున్న. ఏం జేయాలె సోదరులారా? ఏం జేయాలె? ఏం జేయాలె? ఏం జేయాలె? ఏం జేయాలె? ఏం జేయాలె? ఏం జేయాలె? ఏం జేయాలె? ఎవ్వరు చేయెత్తుతలేరేందిరా నాయనా?’.. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎదురైన చేదు అనుభవం ఇది. పదేపదే బతిమాలినా జనం స్పందించకపోవడంతో ఆయన నిశ్చేష్టుడయ్యారు. ‘ఏం జేయాలె?’ అని ఆరుసార్లు అడిగినా ప్రజల నుంచి స్పందన కరువైంది. బుధవారం బోథ్ నియోజకవర్గం.. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో రేవంత్‌రెడ్డికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. గొంతు చించుకుంటున్నా జనం వినకపోవడం సరికదా, వారి నుంచి కనీస ప్రతిస్పందన లేకపోవడంతో అభ్యర్థులపై అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలో జరిగిన సభలో రేవంత్‌రెడ్డే స్వయం గా బతిమాలినా ఫలితం లేకుండాపోయింది. ఆయన ఎంత మొత్తుకున్నా జనం వినిపించుకోకుండా కుర్చీల నుంచి లేచి వెళ్లిపోయారు.
ఇటు కిటకిట.. అటు కటకట
సభలైనా సమరమైనా బీఆర్ఎస్ తరువాతేనని ప్రస్తుత ఎన్నికల బహిరంగ సభలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతున్నాయి. ‘24 గంటల కరెంట్ ఉండాలా? వద్దా?’ అన్న కేసీఆర్ ప్రశ్న ముగియకుండానే జనం ‘ఉండాలె…ఉండాలె’ అంటూ సభాప్రాంగణం దద్దరిల్లిపోయేలా స్పందిస్తున్నారు. ప్రత్యర్థులపై కేసీఆర్ తనదైన శైలిలో విసురుతున్న వ్యంగ్యాస్ర్తాలకు విరగబడి నవ్వుతున్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలతో మార్మోగిస్తున్నారు. అదే కాంగ్రెస్ సభలు జనం లేక తేలిపోతున్నాయి. బల్మీటికి జనం వచ్చినా రేవంత్ ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ‘చప్పట్లు కొట్టండి’ అని అడిగిమరీ చప్పట్లు కొట్టించుకోవాలని చూసినా నిరాశే ఎదురువుతున్నది.