హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రైతు సంక్షేమ పథకాల అమలు, పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవని తెలుస్తున్నది. దీంతో వ్యవసాయశాఖ పరిధిలోని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సంబంధిత అధికారులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం ప్రభుత్వవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖకు తక్షణమే నిధులు విడుదల చేయాలని మంత్రి తుమ్మల కోరగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తున్నది. వ్యవసాయశాఖ సమర్పించిన ప్రతిపాదనలపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా సమావేశం తర్వాత మంత్రి తుమ్మల వెల్లడించారు. అయితే రేవంత్‌రెడ్డితో భేటీలో నిధుల కోసం తుమ్మల గట్టిగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. వ్యవసాయశాఖకు నిధులు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టినట్టుగా సమాచారం. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, రూ.7 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వ్యవసాయశాఖకు నిధుల సమస్య తీవ్రంగా ఏర్పడిందని, మరో మూడు రోజుల్లో రైతుబీమా పథకాన్ని రెన్యూవల్ చేయాల్సి ఉందనే విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇందుకోసం రూ.1,500 కోట్లు అవసమనే వివరాలు సమర్పించినట్టు తెలిసింది. ఎన్నికల్లో మాట ఇచ్చిన ‘పంటల బీమా’ పథకం నీటిమూటగానే మారిందని రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పారని సమాచారం. ఈ పథకం అమలుకు రూ.3 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పంటలకు సంబంధించి.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నట్టు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఇందుకు నిధుల కొరత వేధిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలన్నింటిని సీఎంకు మంత్రి వివరించినట్టు సమాచారం. ఈ నెలలో యూరియా కొరత తీవ్రరూపం దాల్చుతుందని కూడా నివేదించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, వ్యవసాయశాఖ పరిధిలోని పథకాల అమలు కోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు సమాచారం.