Ration | హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీపై స్పష్టత కరువైంది. దసరా, సంక్రాంతి అంటూ సర్కారు గడువు పొడగిస్తున్నదే తప్ప సన్నబియ్యం మాత్రం పంపిణీ చేయడం లేదు. సంక్రాంతి నుంచి పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. ఇటీవల మార్చినుంచి ప్రారంభిస్తామని గొప్ప గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది. ఇప్పుడు మార్చి కూడా సమీపించింది. అయినప్పటికీ సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంలేదు. తాజా గడువులోపు కూడా పంపిణీ చేయడం కష్టమని పౌరసరఫరాల సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సన్నబియ్యం పంపిణీ ఆలస్యానికి బియ్యం కొరతే కారణమని తెలుస్తున్నది. ప్రభుత్వ ప్రణాళికాలోపమే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్నబియ్యం పంపిణీకి సంబంధించి ప్రకటన చేసే సమయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని తెలిసింది. ఎంత బియ్యం అవసరం? ఆ మొత్తం ఎలా సమకూర్చుకోవాలి? బియ్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి? తదితర విషయాలపై కనీస చర్చ చేయనట్టు సమాచారం. అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు గుడ్డిగా హామీలు గుప్పించి.. ఆ తర్వాత గడువుల పేరుతో దాటవేస్తున్నది.
రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరితో పాటు హాస్టళ్లు, గురుకులాలు, మధ్యాహ్న భోజనం కోసం ఏటా సుమారు 25 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరం. ఇందుకోసం 38 లక్షల టన్నుల ధాన్యం కావాలి. కానీ, ఈ వానకాలంలో ప్రభుత్వం మొత్తం 53.96 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 24 లక్షల టన్నులు మాత్రమే సన్నధాన్యం. ఈ లెక్కన ఇంకా 14 లక్షల టన్నుల సన్న ధాన్యం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైన ధాన్యాన్ని ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీంతో పాటు ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సన్నబియ్యం పంపిణీ కష్టమని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల కార్డులుండగా.. రాష్ట్ర సర్కారు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన కొత్తగా 18-20 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే ఆస్కారమున్నది. వీరికీ ఇవ్వాలంటే మరింతగా సన్నబియ్యం అవసరం.