హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 7(నమస్తే తెలంగాణ): నిమ్స్‌లో బెడ్ల కొరత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇతరులకు బెడ్ కావాలంటూ చికిత్స మధ్యలోనే డిశ్చార్జ్ చేయడంతో సకాలంలో వైద్యం అందక సదరు రోగి మృతిచెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన దుబ్బ యాదగిరి కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధుల చికిత్స కోసం గత నెల 26న నిమ్స్ నెఫ్రాలజీ విభాగంలో ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో ఐసీయూలో చేర్చుకున్నారు. 2,3 రోజుల తరువాత ఐసీయూలో బెడ్స్ ఇతరులకు కావాలంటూ జనరల్‌వార్డుకు షిఫ్ట్ చేశారు. అనంతరం అక్కడ వేరే రోగికి బెడ్ కావాలంటూ ఈ నెల 3న డిశ్చార్జ్ చేశారు. మరుసటిరోజు ఓపీకి తీసుకురాగా, పేషెంట్ అడ్మిట్ ఉన్నట్టు చూపిస్తున్నదని, డిశ్చార్జ్ షీట్ ఇంకా ఆన్లైన్లో అప్డేట్ కాలేదని సిబ్బంది చెప్పారు. 5న మళీ నిమ్స్‌కు రాగా, కొన్ని వైద్య పరీక్షలు చేయాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేయించాలంటే సాయంత్రం 6 గంటల వరకు ఆగాలని సూచించారు. త్వరగా కావాలంటే బిల్లు చెల్లించాల్సి ఉంటుందనడంతో రూ.2100 చెల్లించి పరీక్షలు చేయించినట్టు పేర్కొన్నారు. బీపీ తగ్గి ఆరోగ్యం క్లిష్లంగా మారిందని చెప్పారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారని, శనివారం యాదగిరి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
బెడ్ల కొరత అవాస్తవం
నిమ్స్‌లో బెడ్ల కొరత పూర్తిగా అవాస్తవం. రోగి పరిస్థితి క్లిష్టంగా ఉంటే డిశ్చార్జి చేసే ప్రసక్తే ఉండదు. యాదగిరి విషయంలో కిడ్నీ, కాలేయం రెండూ పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన దశకు చేరుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఆరోగ్యం క్షీణించడం వల్లే ఆయన మృతిచెందాడు.
-డా.శ్రీభూషన్రాజ్, నెఫ్రాలజీ ప్రొఫెసర్