హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూళ్లు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తరగతి గదులు లేక, భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా కోటి రూపాయల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయి. 170 మాడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లలో సైతం తరగతి గదుల కొరత, నిర్వహణ సమస్యలు వేధిస్తున్నాయి. ఇలా రాష్ట్రంలోని ప్రతి మాడల్ స్కూల్లో ఏదో ఒక సమస్య ఉన్నది. దీంతో స్కూళ్లల్లో సివిల్ వర్క్స్, పెండింగ్ పనులు చేపట్టేందుకు రూ. 238 కోట్లు విడుదల చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నిధులు మంజూరు చేస్తేనే స్కూళ్లల్లో సమస్యలు తీరుతాయని నివేదికలో ప్రస్తావించింది.
నిధులిచ్చి బలోపేతం చేయాలి
మాడల్ స్కూల్స్ లో గ్రామీణ నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులను అందిపుచ్చుకుని ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కూళ్లకు నిధులిచ్చి బలోపేతం చేయాలి. ప్రత్యేక దృష్టిపెట్టి పూర్తిస్థాయి వసతులు కల్పించాలి. హాస్టల్ సీట్లను పెంచాలి. ఉచిత విద్యుత్తును ఇవ్వడం సంతోషం. అయితే పెండింగ్ విద్యుత్తు బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయాలి.
– యాకమల్లు, టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు