Telangana | హైదరాబాద్, మార్చి 16 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో నిధులలేమితో పలు కార్పొరేషన్లు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం అయినప్పటి నుంచి కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయించలేదని చైర్మన్లు వాపోతున్నారు. దీంతో ఏడాదిగా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిరుడు వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ఇతర రాష్ర్టాల నుంచి పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేసి.. రైతులకు సబ్సిడీపై ఇచ్చింది. వీటికి సుమారు రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
కార్పొరేషన్లో డబ్బులు లేకపోవడంతో అవి బకాయి పడ్డాయి. ప్రభుత్వం రూ.180 కోట్లు విడుదల చేస్తేనే వచ్చే వానాకాలం సీజన్లో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయగలమని.. లేకుంటే ఈ పదవిలో కొనసాగడం ఎందుకని సదరు కార్పొరేషన్ చైర్మన్ రైతు కమిషన్ చైర్మన్‌తో తన బాధను వ్యక్తంసినట్టు తెలిసింది. పాడి రైతులకు బిల్లుల చెల్లింపులు, ఆయిల్‌ఫెడ్, హాకా, మార్క్‌ఫెడ్ లాంటి కార్పొరేషన్ల్లో భారీగా బిల్లులు పెం డింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో కార్పొరేషన్లకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చొరవ చూపాలని రైతు కమిషన్ చైర్మన్‌ను కార్పొరేషన్ చైర్మన్లు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.