హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై లేబర్ కమిషన్ శుభవార్త చెప్పింది. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసుపై చర్చలకు పిలువడంలో లేబర్ కమిషన్ ఆలస్యం చేస్తుండటంపై జేఏసీ నేతలు సోమవారం కమిషన్ అధికారులతో చర్చించారు. సమ్మె నోటీసు విషయంలో సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 10న ‘చలో లేబర్ ఆఫీస్’కు పిలుపునిస్తామని మీడి యా ముఖంగా హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలతో చర్చించిన లేబర్ కమిషన్ ఈ నెల 9న చర్చలకు ముహూర్తం ఖరారు చేసింది.
చర్చలకు హాజరవ్వాలని మంగళవా రం జేఏసీ, ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషన్ లేఖలు పంపింది. లేబర్ కమిషన్ కార్యాలయంలో 9న సాయంత్రం 4 గంటల కు ఇరుపక్షాలు రికార్డులు, ఆధారాలతో హాజరుకావాలని కోరింది. అన్ని కార్మిక సంఘాల నుంచి ప్రధాన ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు.
ఆర్టీసీలో మార్చి 26 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని నాడు లేబర్ కమిషన్కు, ఆర్టీసీ ఉన్నతాధికారులకు కార్మిక జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మార్చి 20న లేబర్ కమిషన్ స్పందించింది. మార్చి 25న ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలకు రావాలని కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్ 12 ప్రకారం ఈ వివాదాన్ని విచారణకు లేబర్ కమిషన్ స్వీకరించిన నేపథ్యంలో ఇరుపక్షాలను చర్చలకు పిలువడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అనూహ్యంగా అసెంబ్లీ సమావేశాల పేరుతో అటు ఆర్టీసీ అధికారులు చర్చలకు రాలేమని కమిషన్కు సమాచారం ఇవ్వడంతో మార్చి 25న జరుగాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి.
అసెంబ్లీ సమావేశాలు ముగిసి వారం రోజులవుతున్నా లేబర్ కమిషన్ నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి వినతిపత్రం ఇచ్చి.. ‘చలో లేబర్ ఆఫీసు.. కార్మిక గర్జన’కు పిలుపునిచ్చారు. దీంతో లేబర్ కమిషన్ ఇరుపక్షాలను చర్చలకు ఆహ్వానించింది. కాగా ఈ నెల 9న చర్చలు సఫలమైతే కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపడుతున్నారు. ఒకవేళ విఫలమయ్యేలా ప్రభుత్వం కుయుక్తులు పన్నితే ఏ క్షణమైనా మెరుపు సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.