Singareni | కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/గోదావరిఖని): సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు ఒక్కొక్కటీ బట్టబయలు అవుతున్నాయా? దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే రెండు బ్లాక్‌ల గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన పాలకులు, తాజాగా ప్రైవేటీకరణలో భాగంగా మలి అడుగులు వేశారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన సెక్యూరిటీ (రక్షణ విభాగం), వైద్య విభాగాల్లోని ఇద్దరు ఉన్నతాధికారులను ప్రైవేటు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడానికి తాజాగా యాజమాన్యం జారీచేసిన నోటిఫికేషనే ఆ అనుమానాలకు తావిస్తున్నది. సింగరేణి ప్రైవేటీకరణలో భాగంగా ఇప్పటికే కేంద్రం గనులకు వేలం వేస్తున్నది.
సింగరేణికి చెందిన రెండు బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. కేంద్రం తీసుకున్న ఇలాంటి చర్యలను రాష్ట్ర సర్కార్ ఏనాడూ పెద్దగా వ్యతిరేకించలేదు. ప్రస్తుతం అత్యంత కీలక విభాగాల్లోని అత్యున్నత పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తులను తీసుకునేందకు చేపట్టిన చర్యలపై కార్మిక వర్గాలు మండిపడుతున్నాయి. ఇటీవల సింగరేణిలో జరుగుతున్న పలు పరిణామాలను లోతుగా గమనిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు వ్యుహాత్మకంగా అడుగులు వేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ (రక్షణ విభాగం) వింగ్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ (వైద్య విభాగం) వింగ్‌కు చీఫ్ మెడికల్ సర్వీసెస్ ఆఫీసర్ పోస్టులను ప్రైవేటు కాంటాక్టు పద్ధతిలో నియమించేందుకు సింగరేణి సంస్థ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రెండు పోస్టులకు ఈ నెల 10 నుంచి 24 వరకు దరఖాస్తులకు గడు వు ఇచ్చింది. 63 ఏండ్లలోపు వయసు కలిగిన రిటైర్డ్ అధికారులు అర్హులని, నెలకు రూ.2 లక్ష ల చొప్పున జీతభత్యాలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖలో డీఎస్పీ ఆపై స్థాయిలో రిటైర్డ్ అయిన వారికి రక్షణ విభాగంలో, మెడికల్ విభాగంలో రైల్వే ఇతర ప్రభుత్వరంగ దవాఖానలలో 10 నుంచి 15 ఏండ్ల అనుభవం కలిగిన రిటైర్డ్ అధికారులకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నది. ప్రస్తుతం రక్షణ విభాగానికి సెక్యూరిటీ చీఫ్‌గా జీఎం వ్యవహరిస్తున్నారు. వైద్య విభాగానికి సీఎంవో ఉన్నతాధికారిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. కొత్తగా తీసుకునే వారిని ప్రస్తు తం ఉన్నతాధికారుల స్థానంలో నియమిస్తా రా? లేదా అదనపు బాధ్యతలు అప్పగిస్తారా? లేకుంటే ఈ రెండు వింగ్‌లను వీరి పరిధిలోకి తీసుకెళ్తారా? లేక యథావిధిగా కొనసాగిస్తా రా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అత్యంత కీలకమైన విభాగాల్లో సింగరేణి సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నతాధికారులను నియమించేందుకు తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సింగరేణి సంస్థలో 11 భూఉపరితల ఓపెన్ కాస్ట్ గనులు, 22 భూగర్భ గనులు పనిచేస్తున్నా యి. వీటికి తోడుగా అనేక విభాగాలు ఉన్నా యి. వీటన్నింటిలో బొగ్గు స్క్రాప్ ఇతర సామగ్రిని దొంగతనానికి గురికాకుండా ప్రస్తుతం సింగరేణి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కార్ప్స్ (ఎస్అండ్పీసీ) విభాగం పనిచేస్తున్నది. ఈ విభాగంలో ప్రైవేటు ఉన్నతాధికారి ప్రవేశించి వారిపై ఆధిపత్యం కొనసాగిస్తే వర్గపోరు తప్పదని హెచ్చరిస్తున్నారు. వీరివల్ల అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా కార్మిక వర్గాల్లో నెలకొన్నది.
సింగరేణి సంస్థ వైద్య విభాగంలో ఇప్పటికే పలు అన్‌ఫిట్ కేసుల్లో భారీగా డబ్బు చేతులు మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మరో ఉన్నతాధికారిని కాంట్రాక్ట్ పద్ధతిలో ని యమిస్తే ఆయనకు ఉన్న విశేష అధికారాలతో మెడికల్ అన్‌ఫిట్ దందాలో తలదూర్చే అవకాశం ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయలకు అవినీతికి ఆస్కారం ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఉన్న ఆ రెండు విభాగాలను పటిష్ఠం చేయడానికి బదులు, కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట ప్రైవేటీకరణ చర్యలకు దిగుతున్నట్టు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి అడుగులు వేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కీలకమైన రెండు విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులను నియమించే చర్యను సింగరేణి విరమించుకోవాలి. రాజకీయ ఒత్తిళ్లుకు లొంగి ఈ నియామకాలు చేపడుతున్నారు. గతంలో మాదిరిగా అనుభవం కలిగిన అధికారులను నియమించి ఆ శాఖలు పగడ్బందీగా నడిచేలా చూసుకోవాలి. ఈ రెండు కీలక విభాగాల్లో పరస్పర వైరుధ్యాలు ఏర్పడకుండా వెంటనే సింగరేణి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని నోటిఫికేషన్లను రద్దుచేయాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
సింగరేణి అధికారుల సంఘం జోక్యం చేసుకుని ఈ నియామకాలను అడ్డుకోవాలి. సంస్థ అధికారులకు రావాల్సిన పోస్టులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తుంటే ఊరుకుంటా రా? సింగరేణి వ్యాప్తంగా అధికారులు ఈ చర్యను అడ్డుకోవాలి. ప్రభుత్వం వెంటనే నియామకాలను రద్దుచేయాలి.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో రెండు కీలక విభాగాల్లో ప్రైవేటు వ్యక్తులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవినీతికి ఊతమిచ్చేలా ప్రైవేట్ ఉన్నతాధికారిని నియమించాలని చూస్తున్నారు.
– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు