హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముహూర్తం కుదరడం లేదు. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనే లక్ష్యంతో 2023 ఆగస్టులో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి సంబంధిత బిల్లును గవర్నర్‌కు పంపింది. దానిపై నాటి గవర్నర్ తమిళై సౌందర్ రాజన్ మొదట్లో కొన్ని అభ్యంతరా లు వ్యక్తం చేసినప్పటికీ బీఆర్ఎస్ పోరాటం, కార్మికుల ఆందోళనలతో ఆ బిల్లుపై సంతకం చేశారు. దీంతో 2023 సెప్టెంబర్ 15న గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ, ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ రావడంతో అపాయింటెడ్ డే పెండింగ్‌లో పడిపోయింది. దీంతో దాదాపు 40 వేల మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.
కాగా, రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రమంతటా ఊదరగొట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు కార్మికులకు వెంటనే రెండు పీ ఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, తదుపరి పీఆర్సీ పరిధిలోకి టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొస్తామని ఆ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లేసిన ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారేమోనని 16 నెలలుగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ హామీలు నెరవేరకపోవడం, ఇప్పటికీ అపాయింటెడ్ డేను ప్రకటించకపోవడంపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు విలీన హామీని పక్కనపెట్టారని ధ్వజమెత్తుతున్నారు. విలీన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ పని ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత తెరవెనుక నుంచి విలీన ప్రక్రియను అడ్డుకుంటున్నాడని, ఇప్పటికైనా వెంటనే అపాయింటెడ్ డేను ప్రకటించకపోతే ఆ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తామని కార్మిక సంఘాలు ప్రభుత్వన్ని హెచ్చరిస్తున్నాయి.
విలీన కమిటీలో కార్మిక సంఘాలుండాలి
ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన కసరత్తు అంతా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత ఆ అంశాన్ని తుంగలో తొక్కిందని కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే త్వరలో తాము చేపట్టనున్న సమ్మెలో ‘అపాయింటెడ్ డే’ని కూడా ప్రధానాంశంగా చేర్చామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెప్తున్నారు. విలీన కమిటీలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, ఆ సం ఘాల సూచనల ఆధారంగానే తుది నిర్ణయం జరగాలని డిమాండ్ చేస్తున్నారుప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ ఎలా తగ్గించారు?
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించడంతోపాటు ఆర్టీసీ కార్మికుల కోసం గవర్నర్‌తో కొట్లాడింది. ఆర్టీసీ నేతలను, అధికారులను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడి, అపాయింటెడ్ డేని కూడా ప్రకటించింది. మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నది? గత ప్రభుత్వం కొత్త బస్సులు కొన్నది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆర్టీసీ కార్మికులను కూర్చోబెట్టి ఉదారంగా జీతాలు ఇచ్చింది. ఆర్టీసీకి బీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పే దమ్ము మాకున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీ ఇచ్చి వారికి 6% హెచ్ఆర్ఏ తగ్గించారు. మరి ఆర్టీసీ సిబ్బందికి 21% పీఆర్సీ ఇచ్చి.. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారితో సమానంగా 6% హెచ్ఆర్ఏ ఎందుకు తగ్గించారు? సమ్మె డిమాండ్లలో ప్రధాన అంశమపైన ఆర్టీసీ అపాయింటెడ్ డేని ప్రకటించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది.
– ఎం థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి