హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): 29 కార్మిక చట్టాలను కుదించి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుంటే, అడ్డుకోవాల్సిన రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అమలుకు ఉపక్రమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికుల శ్రమ దోపిడీకి తెరలేపాయని విమర్శించారు. శనివారం తెలంగాణభవన్‌లో ‘నాలుగు లేబర్కోడ్లు.. శ్రమశక్తి నీతి’ అనే అంశంపై బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తోపాటు పెన్నార్ స్టీల్, ఎంఆర్ఎఫ్, కిర్బీ, మహేంద్రా అండ్ మహేంద్ర, ఎంటీఏఆర్, సీవోసీ, యూరోఫ్లెక్స్, బీపీఎల్, రాణే, కార్తీకేయ యూనియన్ ఫ్యాక్టరీ లీడర్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, విద్యుత్తు, హమాలీ, గిగ్ వర్కర్స్, బీడీ, ఆటో, ట్యాక్సీ, లారీ, ఈసీఐఎల్, బీడీఎల్, మిధాని, హెచ్ఏఎల్, ఏయిర్‌లైన్స్, డొమెస్టిక్, ఆశ, ప్రైవేట్ స్కూల్స్ యూనియన్ల నేతలు పాల్గొన్నారు. బీసీ బిడ్డ ఈశ్వరాచారి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన లేబర్‌కోడ్‌లతో శ్రామికవర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తిపలికి 12 గంటల పని విధానం అమల్లోకి తేవడం దుర్మార్గమని మండిపడ్డారు. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే లేబర్కోడ్లకు చట్టబద్ధత కల్పించడం శోచనీయమని పేర్కొన్నారు. శ్రమశక్తి నీతి కాద ని, కార్మికుల లూటీ అని అభివర్ణించారు. భవిష్యత్తులో పీఎఫ్, పింఛన్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్మిక సంఘాలన్నీ ఏకమై కేంద్రం వైఖరిని ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
గతంలో కేంద్రం తెచ్చిన అనేక చట్టాలను రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేయలేదని కార్మిక సంఘాల నేతలు గుర్తుచేశారు. కానీ, రేవంత్ సర్కారు మోదీ సర్కారుకు వంతపాడుతూ లేబర్కోడ్ల అమలుకు ఉపక్రమించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలో మాత్రం వర్తింపజేయాలని నిర్ణయించడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో దానకర్ణాచారి, సత్యప్రసాద్, సత్యేంద్రసింగ్, ఎల్లమయ్య, బాలకృష్ణ, నగేశ్‌యాదవ్, హమాలీ శ్రీనివాస్, మారయ్య, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.