అమీన్పూర్ సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీహెచ్ఈఎల్ (భెల్) కార్మిక సంఘం సీనియర్ నాయకుడు ఎల్లయ్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు రామచంద్రపురంలోని పనేశా మెరిడియన్ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కార్మిక నాయకుడిగా బీహెచ్ఈఎల్తోపాటు పలు పరిశ్రమల్లోని సమస్యలను పరిష్కరించిన ఆయన మృతితో కార్మికలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
భెల్ ఎల్లయ్య మృతికి కేటీఆర్ సంతాపం
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కార్మిక నాయకుడు, భెల్ (బీహెచ్ఈఎల్) ఎల్లయ్య మృతికి కేటీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కార్మికుల హకుల కోసం ఆయన చేసిన పోరాటాలు అపూర్వమని ప్రశంసించారు. సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, భెల్ కార్మికులందరికీ బలమైన గొంతుకగా మారిన ఎల్లయ్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్మికలోకానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఆయన మరణం కార్మిక లోకానికే కాక, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు, అనుచరులకు శుక్రవారం ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్మికుల్లో చెరగని ముద్రవేసిన భెల్ ఎల్లయ్య మరణం బాధాకరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మృతి కార్మిక లోకానికి తీరని లోటని పేర్కొన్నారు.