హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు తమ హక్కులు, రక్షణ కోసం 29 లేబర్ కోడ్లు సాధించుకున్నారని గుర్తుచేశారు.
కేంద్రం తీసుకొచ్చిన లేబర్కోడ్లు కార్మికుల హక్కులకు తిలోదకాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల వేతనాలు, పనిగంటలు, సామాజిక భద్రత వంటి హక్కులు ఈ నాలుగు లేబర్కోడ్లు కాలరాస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.