హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): లేబర్ కోడ్లతో కార్మికులకు రక్షణ కరువైందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో ప్రతికా స్వేచ్ఛకు ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నారు. నీలం రాజశేఖర్‌రెడ్డి రీసెర్చ్ సెంటర్, సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ‘దేశంలోని కొత్త కార్మిక చట్టాలు, వాటి ప్రభావాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ.. 1921లో ఏఐటీయూసీని స్థాపించినప్పటి నుంచి కార్మికుల పోరాటాలను ముందుండి నడిపిస్తున్నదని తెలిపారు.
కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. నిరుడు 100 మంది కార్మికులు ఉన్న పరిశ్రమలు మూసివేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరమని, ఇప్పుడు దానిని 300 మంది కార్మికులకు పెంచారని తెలిపారు. దీంతో 80 శాతం పరిశ్రమలు రక్షణ పరిధి బయటకు వెళ్లాయని ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని ట్రేడ్ యూనియన్లు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, ఇది కార్మికులకు “చావో రేవో” అని వెల్లడించారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త కార్మిక చట్టాలతో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని తెలిపారు. ఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పీ ప్రసాద్ మాట్లాడుతూ.. ట్రేడ్ యూనియన్ నాయకులు తమను కార్మిక నాయకులుగా పిలవడానికి భయపడుతున్నారని చెప్పారు. ఈ సదస్సులో ఎన్ఆర్ఆర్ఆర్సీ కన్వీనర్ కే అజయ్‌కుమార్, ఎన్ఆర్ఆర్ఆర్సీ డైరెక్టర్ టీ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.