హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కథకు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే అని, బీఆర్ఎస్ సినిమా సూపర్‌హిట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కథకు కర్ణాటక నుంచి స్క్రీన్ ప్లే, రాజస్థాన్ నుంచి రచన, ఢిల్లీ నుంచి దర్శకత్వం వహిస్తుంటే.. ఇక్కడున్నవారంతా హీరోల్లా ఫీలవుతున్నారని చమత్కరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బొమ్మలు అట్టర్ఫ్లాప్తో పరాజయం మూటగట్టుకోవడం పక్కా అని చెప్పారు.
తెలంగాణ భవన్లో మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన గద్వాల నేత కురవ విజయ్‌కుమార్, జనగామ, పాలకుర్తి, హైదరాబాద్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి.. రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక అని, ఆ గొంతుకను ప్రతిపక్షాలు నులిమే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలే సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాలని కోరారు. తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని బాగు చేస్తుంటే.. కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారా అని, ఉచిత కరెంటు మూడు గంటలు చాలంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఓటేసేముందు ఆలోచించాలి
వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేముందు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తీవ్రమైన కరువు, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్‌నగర్ జిల్లా రూపురేఖలను సీఎం కేసీఆర్ మార్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేని దుస్థితిని, కాలిపోయిన మోటర్లను, సబ్ స్టేషన్ల ముందు చేసిన ధర్నాలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పద్నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి సంకల్పించారని చెప్పారు.
చాన్స్ ఇస్తే తెలంగాణను అమ్మేస్తాడు..
ఐదేండ్ల క్రితం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి.. నేడు రాష్ర్టాన్ని అమ్ముకొనేందుకు కుయుక్తులు పన్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘మొన్న రేటెంతరెడ్డి, ఇవాళ సీటెంతరెడ్డి.. ఎల్లుండి ఫ్లాటెంతరెడ్డి’ అన్న చందంగా తెలంగాణను బేరం పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేవ చచ్చి బయటి నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఢిల్లీ నాయకులను పిలిపించి ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు అంతా జట్టుగా, గుంపులు గుంపులుగా వస్తుంటే.. సింహం సింగిల్‌గా వచ్చినట్టు కేసీఆర్ కూడా సింగిల్‌గా వస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ధీమా
తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ బీమాతో ధీమాను పెంచినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ కూలీలు, భూమిలేని వారికి, తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి రూ.5 లక్షల బీమా ఇస్తామని తెలిపారు. దొడ్డు బియ్యం స్థానంలో అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచారని, ఆ భారం తగ్గించేందుకు రూ.800 రాష్ట్ర ప్రభుత్వం భరించి.. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సుమారు వెయ్యిమందికిపైగా కురవ విజయ్ మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రేటెంతరెడ్డి ఇక కాస్కో
ఉద్యమ నాయకుడిగా నేను బీఆర్ఎస్లోకి రావడం సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇన్నేండ్లుగా సేవ చేసిన నన్ను అవమానించి పంపిన రేటెంతరెడ్డి ఇక కాస్కో.. కాంగ్రెస్ ఓటమి కోసం నేనూ నావాళ్లు కృషి చేస్తాం. చంద్రబాబు కోవర్టుగా ఉంటూ నీ తమ్ముళ్లతో సీట్లు కొనుగోలు చేయిస్తూ.. తెలంగాణ ప్రజలను తాకట్టు పెడుతున్నవ్. కోట్లు తెచ్చినోళ్లకే టిక్కెట్లు కేటాయించే నీ దుర్బుద్ధికి మేం చరమగీతం పాడుతాం. కాంగ్రెస్ సీనియర్ నేతలకు దమ్ముంటే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి తరిమి కొట్టాలి. సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష. ఈ రాత్రి నుంచే బీఆర్ఎస్ గెలుపుకోసం, కాంగ్రెస్ ఓటమి కోసం కృషి చేయండి. ప్రతి ఒక్కరూ ఒక్కో అభ్యర్థి అనుకొని.. మన బీఆర్ఎస్ గెలుపుకోసం పాటుపాడాలి.
– కురవ విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్