Kuruva Vijay Kumar | హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు టీ పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం 15 ఏండ్లుగా అహర్నిశలు పని చేసిన తనను కాదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వ్యక్తికి గద్వాల టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను డబ్బులకు, భూములకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకోకపోతే.. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు తమను భౌతికంగా వేధిస్తున్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి, గత 15 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంటే, ఇవాళ అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమను అణగదొక్కడానికి రేవంత్ కుట్రలు చేస్తున్నారని విజయ్ కుమార్ మండిపడ్డారు.