నాగర్‌కర్నూల్, మే 22 : గొల్లకురుమల జోలికి వస్తే పాతరేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కురుమ యాదవ సంఘం రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, గొల్లకురుమలను అవమానపరిచేలా రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు లాలుయాదవ్ అధ్యక్షతన బస్టాండ్ కూడలిలో మూడు గంటలపాటు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్‌యాదవ్, జేఏసీ కన్వీనర్ కడారి అంజయ్యయాదవ్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, అయోధ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారం యాదవ్ మాట్లాడు తూ యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుం టే ఈనెల 25న జేఏసీ ఆధ్వర్యంలో గాంధీభవన్, రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బస్టాండ్ కూడలిలో రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని పేడతో కొట్టి, ఆగ్రహం వ్యక్తం చేశారు.