నార్కట్పల్లి : తనకు ఏకైక ఆస్తిగా మిలిగిన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పెందోట సోమయ్య కూరెళ్లకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూరెళ్ల విఠలాచార్య అందరివాడని, వారి సేవలు మనందరికీ అవసరమన్నారు. పెన్షన్ డబ్బులతో మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనుడు కూరెళ్ల అని ప్రశంసించారు. 2 లక్షల పుస్తకాలను సేకరించిన మహోన్నత వ్యక్తి విఠలాచార్య అని కొనియాడారు.
విఠలాచార్య చిన్నతనం నుంచే అనేక కష్టాలను చవి చూశారని ఆయన పేన్నారు. ఏడేళ్ల ప్రాయంలోనే రచనలు చెయ్యడం వారికున్న పట్టుదలకు నిదర్శమన్నారు. వారు సాహిత్య రంగానికి అందించిన సేవలకు మరెన్నో బిరుదులు వారికి రావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనేక సాహితీ, విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు.