హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది. నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుందురు రఘవీర్రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆయన 5,59,905 మెజార్టీ వచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మహబూబ్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 4,500 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలుపొందారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మహబూబ్నగర్, మెదక్ స్థానాల లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ రెండు స్థానాల్లో చివరి వరకు ఫలితం దోబుచులాడింది.
మెదక్ స్థానంలో మొదట్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య అతి తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓట్ల లెక్కింపు సాగింది. మధ్యాహ్నం తర్వాత బీజేపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే ముందు నిలిచారు. మహబూబ్నగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మొదటి నుంచి అతి తక్కువ మెజార్టీతో కొనసాగారు. ప్రతి రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వల్ప ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు. అటూ ఇటుగా ఫలితం మారే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో ఈ సీటుపై అసక్తి నెలకొన్నది. చివరివరకు అదే ఉత్కంఠ కొనసాగింది. చివరికి డీకే అరుణ స్వల్ప ఆధిక్యతతో గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

