హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌజ్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం హైటెక్స్‌లో బయో ఏషియా-2026 సదస్సు ముగింపులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం’ పేరిట నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’కు శ్రీకారం చుట్టామన్నారు.
2047నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. 2రోజులపాటు సాగిన బయో ఏషియా-2026 సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్‌టెక్ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధానకర్తలతోపాటు పేరెన్నికగల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.