హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కానట్టు రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ హమీలపై స్పందించిన బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ హామీలపై అదే మాటమీద ఉంటారా? అని నిలదీశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, తరువాత అనేక హామీలు ఇచ్చిందని, వాటిలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, నల్లధనం వెనకి రప్పించి ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు ఆదాయం రెట్టింపు, ప్రతి ఒకరికి ఇండ్లు తదితర హామీలు ఎంత వరకు అమలయ్యాయని నిలదీశారు. విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోలేదని, రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకంత వివక్ష, సవతిప్రేమ? అని ధ్వజమెత్తారు. ‘దీనికి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారు?, చెప్పుతో కొట్టుకుంటారా? లేక తలను నెలకేసి కొట్టుకుంటారా?’ అని ఎద్దేవా చేశారు.