హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని తమ పార్టీ ఎన్నడూ చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు మినహా మల్లన్నసాగర్ లాంటి మిగతా బరాజ్‌లు మంచివేనని తెలిపారు. కూలిపోయిన వాటిని రిపేరు చేసేందుకు రూ.20 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొం టూ.. భవిష్యత్తు తరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడాలంటే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లను తీసివేసి తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునర్నిర్మాణం లేదా మరమ్మతులు, సాధ్యాసాధ్యాలపై అఖిలపక్షాలతోపాటు ఇరిగేషన్ మేధావులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించిన విధంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్దనే బరాజ్‌ను నిర్మిస్తే, కేవలం ఒకే లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీతో నీటిని తీసుకెళ్లే అవకాశం ఉండేదని తెలిపారు. వెంట నే తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణాన్ని చేపట్టి ఎల్లంపల్లికి నీరు తీసుకెళ్లాలని, మధ్యలో ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లంపల్లి నుంచి ఎగువన మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్లు ఉన్నందున తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకున్నా ఇబ్బంది ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కింద ఇప్పటికే 70 కి.మీ. మేరకు కాలువలు కూడా పూర్తయ్యాయని గుర్తుచేస్తూ.. అకడి నుంచి దిగువ ప్రాంతాలకు నీరు వస్తున్న మైలా రం వద్ద 20 మీటర్ల లిఫ్ట్ ఏర్పాటు చేయడంతోపాటు 40 కి.మీ. కాలువను తవ్వితే గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. వరద జలాలపై తెలంగాణకు సైతం హకు ఉంటుందని పేర్కొంటూ.. అందుకు సంబంధించి వాటాను తేల్చకుండా ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే 3 వేల టీఎంసీల జలాల్లో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలని, ఆ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టును కట్టుకోవాలని స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ కూడా పాల్గొన్నారు.