హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మరణించిన ఎన్కౌంటర్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేంద్రం ముందుకు రాకపోతే కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, న్యాయవిచారణకు ఆదేశించాలని కోరారు.
గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై చాలా అనుమానా లు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఆయన ఈ వయస్సులో అడవిలో ఉన్నారా? ఎక్కడో పట్టుకుని తీసుకెళ్లి అకడ చంపేశారా? అనే కథనాలు వస్తున్నాయని తెలిపారు. ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి జరిగిన మావోయిస్టులు, ఆదివాసీల ఎన్కౌంటర్లను కూడా విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు.
బుధవారం జరిగిన ఎన్కౌంటర్పై.. శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించడం విచారకరమని మండిపడ్డారు. ప్రజల హకులు, ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడం సమంజసం కాదని ఆయన పేరొన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని, సుప్రీంకోర్టు న్యాయవిచారణ జరిపించాల్సిన అవసరముందని సాంబశివరావు అన్నారు.
పాల్వంచ/టేకులపల్లి, మే 22 : ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26మంది మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించారు. గురువారం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నటరాజ్ సెంటర్ వద్ద, టేకులపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపి, అమరవీరులకు సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎన్డీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖలు విడుదల చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. మావోయిస్టులకు మద్దతుగా ప్రజ లు, ఆదివాసీలు, ప్రజాస్వామికవాదులు, అన్ని పార్టీల శ్రేణులు ఉద్యమాలకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ విజ్ఞప్తిచేశారు. ఈ హత్యలకు కారకులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో కోరారు.
నంబాల కేశవరావుతో సహా 26మందిని ఎన్కౌంటర్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివాసీల భూములను బహుళజాతి సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై మారణహోమాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే కాల్పులను విరమించి.. మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.