Jainur | మంచిర్యాల, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మంది పోలీసులు జైనూర్‌లో పహారా కాస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లను రప్పించి గురువారం మధ్యాహ్నం వరకు షాపుల్లోని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పడిపోయేలా ఉన్న మూడు బిల్డింగ్‌లను జేసీబీతో కూల్చివేశారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా గస్తీ కాస్తున్నారు. జైనూర్‌లో గురువారం ఉదయం నుంచి 48 గంటలపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు.
జైనూర్‌తోపాటు ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇల్లు విడిచి ఎవరూ బయటికి రావొద్దని, ఇద్దరికి మించి రోడ్ల మీద గుంపులుగా కనిపించొవద్దని ఆదేశాలు జారీచేశారు. మండలం కేంద్రంలోని ప్రతి గల్లీలోనూ పోలీసులు కాపలా ఉన్నారు.
ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, బాలానగర్ డీసీపీ (ఆసిఫాబాద్ పాత ఎస్పీ) సురేశ్‌కుమార్ జైనూర్‌లోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జైనూర్లోని ఓ వర్గానికి చెందిన పెద్దలతోపాటు, ఉట్నూర్‌లోని కుమ్రం భీం భవన్లో ఆదివాసీ నాయకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని సూచించారు. జైనూర్‌కు వెళ్లే ఆరు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతరులెవరినీ లోపలికి అనుమతించడం లేదు. మీడియానూ బయటే ఆపేసి, తిరిగి పంపించేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, మీటింగ్‌ల నిర్వహణపై నిషేధం విధించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఘటనా స్థలికి వెళ్తుండగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అడ్డుకొని వెనక్కి పంపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో తక్షణం శాంతినెలకొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. బాధితురాలి కి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, అల్లర్లలో ఇండ్లు, షాపులు కోల్పోయినవారికి సాయమందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడ టం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయన్న ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తిస్థాయిలో హోం మంత్రి లేకుండానే రాష్ర్టాన్ని నడపటం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డలను చట్టవిరుద్ధంగా, అక్రమంగా, నిరంకుశంగా అరెస్ట్ చేసి భయపెట్టలేరనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అలా చేయాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉండదని చెప్పారు. వరద సాయం విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ఆరు గ్యారెంటీల డొల్లతనాన్ని బయటపెట్టి, ప్రజల ముందు సర్కారు సిగ్గుపడేలా చేశాడనే అక్కసుతోనే ఆయనను అరెస్ట్ చేశారని ఎక్స్‌వేదికగా కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చేతగాని పాలన, అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధిచెప్తారని స్పష్టంచేశారు.