రామంతాపూర్,ఫిబ్రవరి 12: కుంభమేళాకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శశికాంత్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అలాగే మృతుల కుటుంబాలను రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతోపాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఆయా నివాసప్రాంతాలకు బుధవారం చేరుకున్నాయి. దీంతో నాచారం ప్రాంతాల్లోని మల్లాపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, మారయ్య, ఆశు, జావీద్, రెహమాన్, షాబుద్దీన్, మ స్తాన్, సాజీద్, సుక్కల స్వామి, సాబీర్ పాల్గొన్నారు.