హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ (KU) టీహబ్ (T Hub ) తో త్వరలో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ( VC Pratap Reddy ) అన్నారు. శనివారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కేయూ ఫార్మసీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రుసా వంటి సంస్థల మద్దతుతో విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీ మరింత అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.
ఇప్పటివరకు ఈ విశ్వవిద్యాలయం నుంచి 600 మందికి పైగా పీహెచ్‌డీలు పూర్తిచేసినట్లు చెప్పారు. వారిలో చాలామంది పరిశోధకులు, ఉపాధ్యాయులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నతస్థాయిలలో పనిచేస్తున్నారని వివరించారు. డిసెంబర్లో రాష్ట్ర స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కళాశాలలో పని చేసిన పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యా, ప్రయోగశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మద్దతు ప్రశంసనీయమన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల వారసత్వాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశంసించారు. యూనివర్సిటీ తన పేరు, కీర్తిని తిరిగి తీసుకురావాలన్నారు. పూర్వవిద్యార్థుల సావనీర్, రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.కృష్ణవేణి సహా అనేక మంది అధ్యాపకులు, ప్రముఖులు పాల్గొన్నారు.