హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. న్యూస్ 24 చానల్ విడుదల చేసిన లోక్సభ ఎన్నికల సర్వే ఫలితాలను సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఎనిమిది సీట్లు వస్తాయని న్యూస్ 24 అంచనా వేసిన నేపథ్యంలో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్’ మధ్య తెలంగాణలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 2, బీజేపీ 6, ఎంఐఎం 1 ఒక స్థానం గెలుచుకుంటాయని న్యూస్ 24 అంచనా వేసింది.