KTR | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 1: ఆపదలో ఉన్న ఓ పసికందు ప్రాణాన్ని కాపాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మొండలం అక్కపల్లికి చెందిన ముక్క బాల్‌రాజు-కల్పన దంపతుల కుమారుడు భరత్‌కుమార్. పుట్టుకతోనే బాలుడి గుండెకు రంధ్రం ఉందని, మందులతో తగ్గుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఐదు నెలలు. మూడు నెలల వయసు వచ్చే సరికి రంధ్రం తగ్గకపోగా సమస్య పెద్దదై, శ్వాస ఇబ్బంది ఏర్పడింది. దీంతో గత నెల 7న హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తరలించారు. ఆపరేషన్ కోసం రూ.8 లక్షలు అవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాలుడి తల్లికి బంధువైన అల్మాస్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ములిగె ప్రమోద్ ఈ విషయాన్ని కేటీఆర్‌కు గత నెల 9న వాట్సాప్‌లో సమాచారం అందించాడు. కేటీఆర్ వెంటనే స్పందించి బాలుడి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. గత నెల 11న బాలుడికి ఆపరేషన్ పూర్తయింది. తమ కొడుకు ఆపరేషన్ కోసం సాయం అందించిన కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.