KTR | హైదరాబాద్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ): అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని, దీనిపై సమాధానం ఉన్నదా? అని కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అదానీ, సెబీ చైర్మన్ ఇటీవల భేటీ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రాహుల్‌గాంధీ సైతం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.
పీఎం మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. సెబీ సమగ్రత దెబ్బతిన్నదని, అదానీ అంశంలో జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని రాహుల్ ప్రశ్నించారు. ఆయా అంశాలను ఉటంకిస్తూ ఎక్స్‌వేదికగా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
తెలంగాణలో అదానీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న సీఎం వల్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కూడా రాజీ పడిందని పేర్కొన్నారు. అదానీకి తెలంగాణలో రెడ్ కార్పెట్ స్వాగతం ఎందుకు పలుకుతున్నారని, ఆ ద్వంద్వ ప్రమాణాలపై సమాధానం ఉన్నదా? అని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.
అదానీ, రేవంత్‌రెడ్డి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. సెబీ చీఫ్ అదానీతో భేటీ కావడం షాకింగ్‌గా ఉన్నదని విస్మయం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.