KTR | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికులవి ఆత్మహత్యలు కాదని, అవి సర్కారు హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక నేత కార్మికులు ఉసురు తీసుకుంటున్నా సర్కారు ఆదుకోదా? అని ధ్వజమెత్తారు. బలవన్మరణాలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై ఉన్న అక్కసును ప్రజలపై తీర్చుకోవద్దని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నేతన్నలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో వరుసగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారని, ఆ కుటుంబాలను ఆదుకొని చేనేత రంగానికి ప్రోత్సాహకాలను పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. గత పదేండ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేత రంగం.. ఇందిరమ్మ రాజ్యం (సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం) సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాల హ యాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లిందో.. మళ్లీ ఆర్నెల్లుగా అలాంటి పరిస్థితే ఎదురవుతున్నదని వెల్లడించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయాలన్న కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి వల్లే నేడు నేతన్నలు ఉపాధి కోల్పోయారని, పవర్‌లూమ్స్ బంద్ కావడంతో కార్మికులే కాకుండా ఆసాములూ రోడ్డునపడ్డారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే దుర్నీతి పాలనతోనే ఈ స్థితి దాపురించిందని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఉపాధిలేమితో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన 10 మంది చేనేత కార్మికుల వివరాలను కేటీఆర్ లేఖతో జతచేసి సీఎం రేవంత్‌రెడ్డికి పంపారు. సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు టెక్స్‌టైల్‌శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం అని తెలిపారు.
సర్కారు వైఫల్యం వల్లే మరణమృదంగం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే మగ్గాల కార్మిక క్షేత్రంలో మరణమృదంగం మోగుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలోనూ చేనేత కార్మికులను కాపాడుకునేందుకు కేసీఆర్ అనేక కార్యకమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. భూదాన్ పోచంపల్లిలో నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నామని ఉదహరించారు. కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షలతో ట్రస్ట్ ఏర్పాటుచేసి అండగా నిలిచారని వివరించారు. గత అరవై ఏండ్ల నేతన్నల దుఃఖంపై కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా బడ్జెట్‌ను పెంచి చేనేత, జౌళిశాఖ ద్వారా అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సంక్షోభంలో చికిన పరిశ్రమను ఆదుకోవడానికి వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిచి రోజంతా అధికారులతో కలిసి నాటి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి నేతన్నల వేతనాలు, కూలీలను రెట్టింపు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. బతుకమ్మ చీరల పంపిణీ, రంజాన్, క్రిస్మస్ కానుకల ప్రారంభం వెనుక మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవాలని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కాంతులతో వెలుగులీనిందన్నారు.
ఇప్పుడు తిరిగి సంక్షోభంలోకి..
సంక్షోభం నుంచి గట్టెకిందనుకున్న చేనేత రంగం కాంగ్రెస్ సర్కారు చర్యల పుణ్యమా అని తిరిగి సంక్షోభంలోకి వెళ్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను దెబ్బతీయాలనే ఆలోచనను, కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధానాలను మార్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. మరమగ్గాల పరిశ్రమ మరణశయ్యపై ఉన్నదని, తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పవర్‌లూమ్స్, నేత పరికరాలపై 90% సబ్సిడీని ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న నేపథ్యంలో తక్షణమే అమలు చేయాలని అన్నారు. చేనేత మిత్ర, థ్రిప్ట్, యార్న్ సబ్సిడీ, నేత పింఛన్లు, నేతన్నబీమా వంటి పథకాలను కొనసాగించాలని సూచించారు.
ఆదుకోకపోతే పోరాటమే
ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు నేతన్న బీమాతో పాటు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేతన్నల విషాదకరమైన పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో పరిష్కరించాలని అన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సీఎం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని తెలిపారు. నేతన్నకు బీఆర్ఎస్ సర్కారు అందించిన ప్రోత్సాహకాలను కొనసాగించాలని, లేదంటే సమస్య పరిష్కారం అయ్యేవరకు సర్కారును వెంటాడుతామని హెచ్చరించారు.
ఆత్మహత్యకు పాల్పడిన 10 మంది కార్మికుల వివరాలు