CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మూసీనదిపై తాము చేపట్టబోయేది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, పునరుజ్జీవ ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే తమ తాపత్రయమని పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు నెలలుగా 33 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించి సర్వే చేసినట్టు వివరించారు.
1,690 ఇండ్లు నదీ గర్భంలో ఉన్నాయని, బఫర్ జోన్లో 10 వేల ఇండ్లు ఉన్నట్టు తెలిపారు. ప్రజలను ఒప్పించి, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు, ఖర్చుల కోసం రూ.25 వేలు ఇచ్చి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. బఫర్ జోన్లో ఉన్న ఇండ్లకు నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని చెప్పారు. మూసీ పునర్జీవం కోసం అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ఐదు కంపెనీలతో కన్సార్షియం ఏర్పాటు చేసి ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 18 నెలల్లో అందిస్తారని, ఆ తర్వాత ఐదేండ్లపాటు ప్రాజెక్టు అమలులో భాగస్వాములు అవుతారని చెప్పారు.
ఆరున్నరేండ్ల సేవల కోసం వారితో రూ.141 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రతిపక్షాలు చెప్తున్న రూ. లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, మూసీ నది పునరుజ్జీవనంపై చర్చకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఎంపీలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల అధ్యక్షులకు అనుమానాలు ఉంటే తనకు రాతపూర్వకంగా పంపాలని పేర్కొన్నారు.
జర్నలిస్టులూ తప్పు పడుతున్నరు!
‘అన్నా మీరేమైనా తప్పు చేస్తున్నారా? వాళ్లు చెప్తున్న విషయాల్లో నిజమనిపిస్తున్నది? అని కొందరు పాత్రికేయ మిత్రులు నమ్ముతున్నారని, మూసీ సుందరీకరణపై తమ ప్రభుత్వం తప్పు చేస్తున్నదేమోనన్న అనుమానం వారిలో కలిగేలా విషప్రచారం జరుగుతున్నదని రేవంత్‌రెడ్డి చెప్పారు.