హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పదేండ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, ఎంపీగా ఐదేళ్ల క్రితం కూడా బండి సంజయ్ ఎన్నిక అయినా నేతన్నలకు నిరాశే ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని చెప్పారు.
కేంద్రంలో స్మృతీ ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మంది మంత్రులను తాను స్వయంగా కలిసి 10 లేఖలు రాసినా దక్కింది శూన్యమని పేర్కొన్నారు. ప్రస్తు తం కేంద్రంలో మంత్రిగా ఉన్న బండి సం జయ్‌కు సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందు కు సరైన సమయంగా గుర్తించాలని ఆయన గుర్తుచేశారు. బడ్జెట్లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా పట్టించుకోవటంలేదని, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇకడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. చేతినిండా పనిదొరికి మళ్లీ ఆత్మహత్యలులేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.