KTR | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రైతులు పండించే ప్రతి క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో దొడ్డువడ్లకు బోనస్, వానకాలం రైతుభరోసాపై ఎటూ తేల్చకుండా ప్రభుత్వం కప్పదాటుగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ పూర్తయినా రైతుభరోసాపై నిర్ణయం తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. రైతులు పండించే ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు.
బోనస్ చెల్లించకుండా గత సీజన్లో ప్రభుత్వం మోసం చేసిందని, ఈ సీజన్లో కూడా ఇప్పటివరకు దొడ్డు వడ్లకు బోనస్ విషయంలో ఎలాంటి స్పష్టతలేకపోవడంతో రైతులు అయోమంలోపడ్డారని తెలిపారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ అని ముఖ్యమంత్రి పేర్కొనడం రైతులను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 80 శాతానికిపైగా రైతులు పండించేవి దొడ్డు వడ్లన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలసని పేర్కొన్నారు. సన్నవడ్లు, దొడ్లువడ్లు అనే తేడా లేకుండా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకోవాలని, గత సీజన్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని రకాలకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నాలకే అంటూ సన్నాయినొక్కులు నొక్కడం రైతులను నిలువునా మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హమీని నిలబెట్టుకోకపోతే రైతులపక్షాన బీఆర్ఎస్ పోరుబాటు పడుతుందని హెచ్చరించారు.
రైతు భరోసా ఊసేదీ?
వానకాలం సీజన్ ఫూర్తయినా రైతుభరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.7,500 ఇస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గత సీజన్లో రైతులకు రైతుబంధు పైసలు మాత్రమే వేశారని, ఈ సీజన్లో ఇప్పటివరకు అసలు రైతుభరోసా సంగతే తేల్చడం లేదని దుయ్యబట్టారు. నాట్లు వేసే సమయంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని పంట చేతికొచ్చే వరకు కూడా ఇవ్వకపోవడమంటే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టేందుకు తహతహలాడుతున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతుభరోసా వేసేందుకు పైసలు లేవా? అని ప్రశ్నించారు. మూసీ పేరుతో చేసే అవినీతి ఆలోచనలను మాని రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఏటా రూ.10 వేలు ముష్టి వేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రూ.15 వేలు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి చెప్పిన మాట విని రైతులు ఆశపడ్డారని తెలిపారు. రూ.15 వేల సంగతేమోగానీ ఆ రూ.10 వేలు కూడా ఇవ్వకుండా రైతును గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుభరోసా ఇస్తారో, ఇవ్వరో ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్ సాయంతోపాటు ఈసీజన్వి కూడా జతచేసి రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ పేరుతో వంచన..వ్యవసాయ మంత్రి ప్రకటనే సాక్ష్యం
వందశాతం రుణమాఫీ అయిందని చెప్పిన ముఖ్యమంత్రి బండారం వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో బట్టబయలైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించడంతో ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. అధికారిక లెకల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటే అనధికార లెకల ప్రకారం ఇంకా ఎంతమంది రైతులు ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఉదహరించారు. రుణమాఫీని పకనపెట్టి మూసీ పేరుతో వేలకోట్లు దోపీడి చేయాలనుకుంటున్న రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చేతకానితనం అన్నదాతలకు కోలుకోలేని శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.