ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం ఉన్న లేకున్నా.. పదవి ఉన్నా, లేకున్నా..ఆపదుందన్నా అంటే అర క్షణం ఆలోచించకుండా అక్కున చేర్చుకునే మనసున్న రామన్న ( KTR) మరో మారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. ఓ పెదింటి బిడ్డ గుండె ఆపరేషన్ ( Heart Surgery) కు సాయం అందించి పేద తల్లిదండ్రులకు భరోసాగా నిలిచారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెళ్ళికి చెందిన ముక్క బాలరాజు- కల్పనా దంపతులకు భరత్ కుమార్ (5 నెలలు) కుమారుడు జన్మించగా పుట్టుకతోనే బాలుడికి గుండెకు రంధ్రం ఉందని అది చిన్నగా ఉందని మందులతో తగ్గుతుందని వైద్యులు తెలిపారు. మూడు నెలల వయసు వచ్చేసరికి రంద్రం తగ్గకపోగా సమస్య పెద్దదై శ్వాస ఇబ్బంది ఏర్పడింది.
దీంతో గత నెల 7 న హైదరాబాదులోని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ కోసం రూ. 8 లక్షలు అవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో బాలుడి తల్లికి బంధువైన అల్మాస్పూర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ములిగే ప్రమోద్ కు తమ పరిస్థితిని తెలిపింది.వెంటనే ప్రమోద్ సదరు సమాచారాన్ని ఎమ్మెల్యే కేటీఆర్‌కు సమాచారాన్ని గత నెల 9న వాట్సాప్ ద్వారా అందజేశాడు.
వెంటనే స్పందించిన కేటీఆర్ బాలుడి ఆపరేషన్‌కు సాయం అందించే ఏర్పాటు చేశాడు. బాలుడి ఆపరేషన్ పూర్తవడంతో ఇటీవల బాలుడి కుటుంబం స్వగ్రామం అక్కపెళ్లికి చేరుకున్నారు. తమ కుమారుడు ఆపరేషన్ చేయించేందుకు సాయం అందించిన కేటీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోలేమని బాలుడి తల్లిదండ్రులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.