హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశంలో వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఆ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతో కీలకమైన వైద్య పరికరాలు విలాస వస్తువుల జాబితాలోకి రావని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య పరికరాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 18 శాతం నుంచి 12 శాతానికి, డయాగ్నస్టిక్స్పై 5 శాతానికి తగ్గించడంతోపాటు ముడిసరుకుపై దిగుమతి సుంకాలను తగ్గించాలని, తద్వారా అందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంగళవారం ఓ లేఖ రాశారు. బయో ఏషియా సదస్సులో భాగంగా గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వివిధ కంపెనీల సీఈవోలు, పలు సంఘాల ప్రతినిధులు హాజరై వైద్య పరికరాల తయారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించినట్టు తెలిపారు. ఆ వివరాలను మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ పరిశ్రమ స్వయం సమృద్ధికి చర్యలు చేపట్టాలని, తక్కువ ధరకు ముడిసరుకు అందుబాటులో ఉండేలా చూడాలని, సప్లయ్ చైన్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, పరీక్షలు, ధ్రువీకరణలకు తగిన మౌలిక వసతులను కల్పించాలని కోరారు.
అసలు ధరల కంటే పన్నులే అధికం
ప్రస్తుతం వైద్య పరికరాల విడిభాగాలపై భారీగా జీఎస్టీ, దిగుమతి సుంకాలు విధిస్తుండటంతో వాటి అసలు ధరల కంటే పన్నులే అధికంగా ఉంటున్నాయని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైద్య పరికరాలను దేశీయంగా తయారు చేయడం కంటే దిగుమతి చేసుకోవడమే లాభసాటిగా మారిందని, ఫలితంగా తక్కువ ధరకు వైద్య పరికరాలను తయారు చేయాలన్న లక్ష్యానికి తీవ్ర విఘాతం కలుగుతున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో విడిభాగాలపై పన్నులు, సుంకాలను తగ్గించి దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.
దిగుమతుల నిల్వలోనూ ఎన్నో సవాళ్లు
వైద్య పరికరాల తయారీకి అవసరమైన విడిభాగాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని, అవి దిగుమతి అయ్యేందుకు కనీసం 6-12 నెలల సమయం పడుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దిగుమతి అయిన విడిభాగాలను, ప్రత్యేకించి ఐసీలు, ఎలక్ట్రిక్ భాగాలు, ఎల్ఈడీ మానిటర్లు, ప్యానెల్ డిస్ప్లే యూనిట్లు, బ్యాటరీలు, సెమీకండక్టర్ల లాంటి భాగాలను నిల్వచేయడంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా విడిభాగాలను దేశీయంగా తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు.
మెడికల్ ఇమేజింగ్ హబ్ ఏర్పాటుకు సహకరించాలి
హైదరాబాద్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లో వైద్య పరికరాల తయారీకి అవసరమైన అత్యాధునిక మెడికల్ ఇమేజింగ్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో వైద్య పరికరాలను పరీక్షించేందుకు సరైన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) లాంటి సంస్థలతో తయారీదారులకు సరైన యాక్సెస్ లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలను పరీక్షించేందుకు దేశంలో ల్యాబ్‌ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.