భవిష్యత్తు ఉన్నా.. బలిపీఠంపై సీసీఐ

- ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంటును తెరవని కేంద్రం
- గేటు ముందే సకల వనరులున్నా మూసివేత
- శాపాలుగా మారిన యూపీఏ, ఏన్డీయే విధానాలు
- ప్లాంటును తెరవొచ్చని నివేదికలన్నీ చెప్పినా వివక్షే
- రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలిస్తామన్నా మౌనం
- మంత్రి కేటీఆర్ లేఖ రాసినా స్పందించని కేంద్రం
(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటుకు గేటు ముంగిటే అన్ని వనరులూ ఉన్నా కేంద్రప్రభుత్వ విధానాలే శనిలా దాపురించాయి. వెనుకబడిన గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్‌లో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీని సమాధి చేయటంలో కేంద్రంలో పాలన సాగించిన కాంగ్రెస్, ఇప్పుడు ఏలుతున్న బీజేపీ పోటీ పడ్డాయి. ఈ ఫ్యాక్టరీ వందేండ్లు నడవడానికి కావాల్సినంత లైమ్‌స్టోన్ (సున్నపురాయి) నిల్వలు సంస్థ గడప వద్దే ఉన్నాయి. నీరు, రోడ్డు, రైల్వే మార్గాలు కూడా ఫ్యాక్టరీ గేటుకు సమీపంలోనే ఉన్నాయి. వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించి ఉంటే సీసీఐ అద్భుతంగా నడిచేది. వేల మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి పోయేదికాదు. కానీ మొదటి నుంచీ కేంద్రప్రభుత్వం ఈ ప్లాంటును అమ్మేయాలనే దుర్మార్గ
ఆలోచనతోనే ఒక్కో అడుగు వేస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవకాశాలున్నాయని చెప్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలోని ప్రధాన భాగమైన క్లింకర్‌ను 1982 ఆగస్టు 15న ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తిని 1984 ఏప్రిల్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్ర మంత్రి ఎన్డీ తివారీ ప్రారంభించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అప్పట్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టారు.
కోటి ఆశలతో ప్రారంభం
రోజుకు 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (ఏటా 4 లక్షల టన్నులు)తో ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ.. సంస్థకు కొంతకాలం కష్టాలు తప్పలేదు. 1989-90 నుంచి పూర్తిగా లాభాల్లో నడవడం మొదలెట్టింది. దీంతో కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కూడా ఇవ్వడం ప్రారంభించింది. అప్పట్లో సిమెంటు బస్తా ధర రూ.90 లోపే. ప్రభుత్వ నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్‌ను ప్రభుత్వం కొనుగోలు (లెవీ సిమెంట్) చేస్తుండేది. అప్పటికి ఆదిలాబాద్ యూనిట్లో 500 మంది కార్మికులు, ఉద్యోగులు, 1,500 మందివరకు కాంట్రాక్ట్ కార్మికులు, మరో వెయ్యి మంది ఇతర కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా మరో 5 వేల కుటుంబాలకుపైగా ఉపాధి లభించేది.
చేజేతులా ధ్వంసం
లాభాల బాటలో పయనిస్తున్న ఫ్యాక్టరీకి 1991-92లో కేంద్రం ఉన్నట్టుండి నిర్వహణ మూలధనాన్ని ఇవ్వటం నిలిపేసింది. దీంతో సంస్థ మొదటిసారి కుదుపునకు లోనయ్యింది. అప్పటి నుంచి కేంద్రం నిర్ణయాలు, నిర్లక్ష్యం, వివక్షతో ప్లాంట్‌ను పూర్తిగా మూసివేసే స్థితికి చేరింది. అధికారికంగా 1998 నవంబర్ 5 నుంచి ఉత్పత్తిని నిలిపివేశారు. నిజానికి ఈ ప్లాంటు దీర్ఘకాలం లాభాల్లో నడిచేందుకు అనేక అనుకూలతలున్నాయి. ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల రెండున కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ముందుకువస్తే సహకారం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు.

- ఫ్యాక్టరీ కోసం 772.95 ఎకరాల భూమిని సేకరించారు. మరో 1,516.90 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. ఇందులో లైమ్‌స్టోన్ (సున్నపురాయి) గనులు 2074.09 ఎకరాల్లో ఉండగా, అందులో సుమారు 48.18 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. పద్నాలుగేండ్లపాటు నడిచిన ప్లాంటు సుమారు 6 మిలియన్ టన్నుల నిల్వలు మాత్రమే ఉపయోగించింది. ఇప్పటికీ 42.66 మిలియన్ టన్నుల సున్నపురాయి నిల్వలు ఫ్యాక్టరీకి కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. దీంతో రవాణా చార్జీల భారం ఒక్కపైసా లేదు.
- ఈ ఫ్యాక్టరీకి నీటిని కూడా సమీపంలోనే ఉన్న సాత్నాల రిజర్వాయర్ నుంచి కేటాయించారు. ఎన్నడూ నీటికి కొరత రాలేదు.
- ఫ్యాక్టరీ గేటుకు కూతవేటు దూరం నుంచి దేశంలోనే అతి పొడవైన కన్యాకుమారి, వారణాసి జాతీయ రహదారి వెళ్తున్నది. కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే బ్రాడ్‌గేజ్ రైల్వే లైను ఉన్నది.
- 1998లో ఉత్పత్తి నిలిపేసినప్పటికీ 1996లోనే సీసీఐని సిక్ ఇండస్ట్రీగా ప్రకటించి బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్)కు కేంద్రం నివేదించింది. బీఐఎఫ్ఆర్ ఇచ్చిన నివేదికలో ఈ ప్లాంటును పునరుద్ధరించవచ్చని స్పష్టంగా సూచించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు.
- 1965లో ఏర్పాటైన సీసీఐకి దేశంలో 10 ఫ్యాక్టరీలున్నాయి. ఆదిలాబాద్, తాండూరు (తెలంగాణ), ఎర్రగుంట్ల (ఆంధ్రప్రదేశ్), అకల్తారా, మాంధార్, నయాగాం, చార్హిదాద్రీ, రాజ్బన్, భోకాజాన్, కూరుకుంట్లతోపాటు ఢిల్లీలో గ్రైండింగ్ యూనిట్ ఉన్నది. అయితే వివిధ ఆర్థిక కారణాలు చూపుతూ 1996 ఆగస్టు 8న దివాలా సంస్థ (సిక్ ఇండస్ట్రీ)గా కేంద్రం ప్రకటించింది. వీటిలో ఆదిలాబాద్ యూనిట్‌తోపాటు ఆరింటిని పునరుద్ధరించవచ్చని టెక్నో ఎకనామికల్ ఫీజిబిలిటీ నివేదికలో డెవలప్మెంట్ కన్సల్టెంట్ లిమిటెడ్ (డీసీఎల్) సంస్థ నివేదిక ఇచ్చింది.
- 1995లో ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సీసీఐ ప్లాంట్ల పునరుద్ధరణకు ఒప్పుకున్నా, ఆ తరువాత వాటన్నింటినీ అమ్మేయాలని సూచించింది. బీఐఎఫ్ఆర్ 2000లో ఆదిలాబాద్‌తో సహా 4 యూనిట్లను పునరుద్ధరించవచ్చని గుర్తించింది. అయితే బోకాజాన్ (అస్సాం)లోని యూనిట్ ఆర్థికంగా వెసులుబాటు కాదని స్పష్టంగా చెప్పినప్పటికీ, 2005లో బీఐఎఫ్ఆర్కు ఇచ్చిన నివేదికలో పునరుద్ధరించే యూనిట్ల జాబితాలో దానికి చోటు దక్కింది. అన్ని నివేదికలు అనుకూలంగా వచ్చినా ఆదిలాబాద్‌కు మాత్రం చోటు దక్కలేదు. కేవలం తాండూరు, బోకాజాన్, రాజ్బన్లను మాత్రమే పునరుద్ధరించారు.
- ఆదిలాబాద్ యూనిట్ పునరుద్ధరణ అవకాశాల పరిశీలనకు కేంద్రం మరోసారి హోటెక్ కన్సల్టెంట్స్ను నియమించింది. ఈ సంస్థ కూడా ఈ యూనిట్‌ను పునరుద్ధరించవచ్చని, దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 1,200 టన్నుల నుంచి 1,600 టన్నులకు పెంచాలని సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- cement plant
- Centre
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

