KTR | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన లక్షలాదిమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు ఆదివారం బహిరంగలేఖ విడుదల చేశారు. కష్టపడి చదివి డాక్టర్ కావాలని కలలుగన్న విద్యార్థులపై, వారి తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. బీహార్లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. ప్రతీసారి విద్యార్థులతో పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ కీలకమైన నీట్ పరీక్షపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు నీట్ వ్యవహారంలో ఒకరిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనేక అనుమానాలు.. సందేహాలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకే పరీక్ష కేంద్రం నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మారులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని ఆయన ఉదహరించారు. ఒక మారు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాలరోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రేస్ మార్కులు కలపడమేంటి?
ఈ ఏడాది నీట్లాంటి పరీక్షల్లో గ్రేస్ మార్కులు కలపడమేమిటి అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది 1,563 మందికి గ్రేస్ మారులు కలిపినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)నే చెప్పిందని తెలిపారు. ఆ విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మారులు ఇచ్చారో, దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయడం లేదని చెప్పారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్లో సాధ్యంకాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మారులు రావడం కూడా మొత్తం గ్రేస్ మారుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. గ్రేస్ మారులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని, లేదంటే గ్రేస్ మారులు లేకుండా ఉన్న ర్యాంకింగ్నే జత చేస్తామంటూ ఎన్టీఏ పూటకో మాట మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ఒక గ్రేస్ మారుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని స్పష్టంచేశారు.
మన విద్యార్థులకు నష్టం జరిగితే పోరాటమే..
గ్రేస్ మారులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా నీట్ రాసిన తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా వారి తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మన విద్యార్థుల తరఫున రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకోవాలని, దీనిపై సమగ్ర విచారణకు కేంద్ర సరారుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పాత్రపైనా అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆ లేఖలో సూచించారు.