హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మికుల కోసం కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు పెంచాం. ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు వారికి భరోసా కల్పించాం. సింగరేణి కార్మికులకు బోనస్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించాం. ఆటో డ్రైవర్లకు, అసంఘటిత కార్మికులకు ఆర్థికసాయంతోపాటు సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం. లక్షల మందికి ఉద్యోగాలు కల్పిం చాం. మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాం’ అని గుర్తుచేశారు. కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ తరఫున నిరంతరం పోరాడుతామని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని సూచించారు.