హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేకుంటే ప్రజలు సబ్స్టేషన్ల ఎదుట ఎందుకు ధర్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్రెడ్డి కరెంటు కోతలు లేవంటున్నారు. 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి ఇక్కడ సబ్స్టేషన్ల ఎదుట ప్రజలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? అని సోమవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉప్పల్లో కరెంటు కోతలకు నిరసనగా స్థానిక సబ్స్టేషన్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టిన వీడియోను పోస్టు చేశారు.
ఆర్-ట్యాక్స్ కోసమేనా అనుమతుల నిలిపివేత?
ఆర్-ట్యాక్స్ కోసమే రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను నిలిపివేస్తున్నారా? అని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ‘టీఎస్ బీపాస్ నిబంధనలకు విరుద్ధంగా కొద్ది నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ఎందుకు ఇలా చేశారు? అనుమతులను నిలిపివేసి, బిల్డర్లపై ఒత్తిడి తేవడం ద్వారా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఆర్-ట్యాక్స్ వసూలు చేసేందుకేనా?’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ‘టీఎస్ బీపాస్ ద్వారా ఇస్తున్న భవన నిర్మాణ అనుమతుల్లో తగ్గుదల చోటుచేసుకోవడంతో బల్దియా ఆదాయానికి భారీగా గండి పడింది. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది రూ.300 కోట్లు ఆదాయం తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి’ అని పేర్కొన్నారు. అనుమతులు నిలిపివేయడం వల్ల ఆదాయం తగ్గినట్టు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను కేటీఆర్ జతచేశారు.