కాంగ్రెస్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి బీజేపీ నాయకులు సందట్లో సడేమియా తరహాలో ఆశపడుతున్నరు. ఇక అధికారం తమదేనని కలలు గంటున్నరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ప్రజల గొంతుకగా పోరాడుతున్న బీఆర్ఎస్వైపే ఉంటరు. ఇందులో ఏ అనుమానంలేదు. మళ్లీ తెలంగాణ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తది.
– కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తేతెలంగాణ) : ‘ఊరూరా.. వాడవాడలా గులాబీ జెండాలు ఎగరేసి హోరుగా నినదిస్తూ.. దిక్కులదిరేలా జై కొడుతూ ఈ నెల 27న ఇంటిపార్టీ ఆవిర్భావ సభకు దండులా కదంతొక్కాలె’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడైనా జెండా గద్దెలు లేకుంటే నిర్మించుకోవాలని, మరమ్మతులుంటే చేయించుకోవాలని సూచించారు. బస్సుల్లో బయలుదేరి సమయానికి సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు,
కార్పొరేటర్లు, కార్యకర్తలతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ విజయవంతంపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలుగునాట 25 ఏండ్లు మనుగడ సాగించిన రెండు పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటని చెప్పారు. ఇన్నేండ్ల ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ పంథాలో రాష్ర్టాన్ని సాధించిన ఘనత గులాబీ పార్టీకే దక్కిందని స్పష్టం చేశారు.
నాడు కేసీఆర్ ఎన్నో ప్రతికూలతల మధ్య పార్టీని స్థాపించి, ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకొని, అనేక అవమానాలను భరించి రాష్ర్టాన్ని సాధించారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘2001లో మంత్రి పదవిని త్యజించి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించిన సమయంలో ఆయన వెంట ఇంత బలగం లేదు. అంగ, అర్థ బలం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నయి. తెలంగాణ కోసం ఎవరైనా కొట్లాడుతరా? లేదంటే గతంలో కాంగ్రెస్ నేతల మాదిరిగా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షను తాకట్టుపెడుతరా? అన్న అనేక అనుమానాలు ఉన్న రోజుల్లో కేసీఆర్ ఉద్యమాన్ని మొదలుపెట్టిండ్రు.
బలమైన మూడు పార్టీలను ఎదిరించి ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని సాగించిండ్రు. ప్రాణాలను పణంగా పెట్టి 2009 నవంబర్ 28న చేపట్టిన ఆమరణ దీక్షతోనే అప్పటి కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ప్రకటించింది’ అని ఉద్ఘాటించారు. ఒక్క నెత్తురు చుక్క కూడా చిందించకుండా ఉద్యమ పంథాలో సబ్బండ వర్గాలను ఏకం చేసి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా సమీకరించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
తర్వాత అధికారం చేపట్టి పదేండ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. ‘సాధించిన రాష్ర్టానికి సారధ్యం వహించే అదృష్టం మీకే దక్కింది’ అని అప్పటి ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆశీర్వదించారని గుర్తుచేశారు. గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారని చెప్పారు. కానీ ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం అలాంటి మహానేతపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు ఘనత తమదిగా చెప్పుకోవడం విడ్డూరమని కేటీఆర్ పేర్కొన్నారు. ‘25 ఏండ్ల కిందట కొండా లక్ష్మణ్ బాఫూజీ నిలయంలో ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్.. 14 ఏండ్లు ఉద్యమ, పదేండ్లు అధికార పార్టీగా విజయవంతగా ముందుకు సాగుతున్నది.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో అద్భుతంగా ప్రజల తరఫున పోరాడుతున్నది’ అని గుర్తుచేశారు. ప్రజలు ఏ బాధ్యత అప్పగించినా అందులో ఇమిడిపోయి ప్రజాగొంతుకను వినిపిస్తున్న గులాబీ జెండానే ప్రజల గుండె ధైర్యమని వ్యాఖ్యానించారు.
2011లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో 99 గెలుచుకొని బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినం. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే విజయం సాధించినం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడింది. హైదరాబాద్ ప్రజల ముందు బీజేపీ, కాంగ్రెస్ ఆటలు సాగలేదు. మాయమాటలు పనిచేయలేదు. అన్ని ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో గెలుపునందుకున్నం. హైదరాబాద్‌లో ఏ పార్టీ బలంగా ఉన్నదంటే చిన్న పిల్లాగాడినడిగినా బీఆర్ఎస్సే అని చెప్తరు’ అంటూ స్పష్టంచేశారు. డీలిమిటేషన్‌తో హైదరాబాద్ పరిధిలోనే సీట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచించారు.
‘హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల మసుగులో రేవంత్ సాగించిన అరాచకానికి అన్ని రంగాలు అతలాకుతలమైనయ్. రియల్ ఎస్టేట్ రంగం ముంబై, బెంగళూరులాంటి చోట్ల పుంజుకుంటే రేవంత్ చేతగానితనంతో హైదరాబాద్‌లో కుదేలైంది. నిర్మాణ రంగంతో పాటు అన్ని రంగాలు దెబ్బతిన్నయి. అన్ని వర్గాలు ఆగమైనయి’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సర్కారు దురాగతాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనులతో ప్రజల్లో అసహ్యం పెరుగుతున్నదని, ఎన్నికలెప్పుడు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పోతదని అవమానించిన వారెందరో కనుమరుగైండ్రు. జనం ఏ బాధ్యత అప్పగించినా అందులో ఇమిడిపోయి ప్రజాగొంతుకను వినిపిస్తున్న గులాబీ జెండానే ప్రజల గుండె ధైర్యం. సమైక్య వాసనలున్న పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేం ఉండదు.
– కేటీఆర్
ఈ ఏడాది పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేటీఆర్ తెలిపారు. డిజిటల్ విధానంలో సభ్యత్వం సేకరిస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఉద్యమంలా సభ్యత్వ నమోదు చేపట్టాలని కోరారు. అలక్ష్యం చేయవద్దని, సేవలను గుర్తించి భవిష్యత్తులో పార్టీ ప్రాధాన్యమిస్తుందని స్పష్టంచేశారు. సభ ముగిసిన మరుసటి రోజు నుంచే పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెడతామని వెల్లడించారు. అక్టోబర్‌లో అధ్యక్షుడి ఎన్నిక పూర్తిచేస్తామని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని జిల్లాల పార్టీ ఆఫీసుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 24న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసిందని కేటీఆర్ తెలిపారు. తాము బీజేపీ, ఎంఐఎంకు దూరంగా ఉంటామని స్పష్టంచేశారు. ఎవరితోనూ దోస్తానాలేదని కుండబద్దలు కొట్టారు. కార్పొరేటర్లు పార్టీ విధానానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేస్తామని, ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. ఎవరైనా ధిక్కరిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎల్బీ నగర్, అంబర్‌పేట, మల్కాజిగిరి, ముషీరాబాద్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి, శంభీర్‌పూర్ రాజు, నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సలీం, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.