మహబూబ్‌నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గిపుట్టిస్తదని.. అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మమైపోతదంటూ నిప్పులు చెరిగారు. ‘జిల్లాలను రద్దు చేస్తే నారాయణపేట వాళ్లు ఊరుకుంటరా? గద్వాల వాళ్లు ఊరుకుంటరా? వనపర్తి వాళ్లు ఊరుకుంటరా? కలెక్టర్లను మీ గడప దగ్గరికి తీసుకొచ్చి కేసీఆర్ కూసోబెడితే.. ఇవన్నీ ఎత్తేస్తాం అని రేవంత్‌రెడ్డి అంటుంటే చూస్తూ ఊరుకుందామా?’ అని ప్రశ్నించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట.. ఏ జిల్లాను ముట్టినా ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రేవంత్ సర్కార్‌ను తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వివిధ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాలనా సౌలభ్యం కోసమే దూర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దనే నాడు కేసీఆర్ కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. నాగర్‌కర్నూ ల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ దాకా వచ్చే అవసరం లేకుండా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులను ప్ర జల చెంతకు తీసుకొచ్చారని చెప్పారు. లంబాడీ గిరిజన సోదరుల ఆకాంక్షలు నెరవేరుస్తూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని.. అయితే అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ సర్కార్ పిచ్చిపిచ్చి పనులు చేయవద్దని, చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
సోనియా, రాహుల్ మీద ఒట్టేసి రైతులను ముంచిండు..
మాట్లాడితే పండబెట్టి తొక్కుతా అనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నిజంగానే వ్యవసాయాన్ని ఆగం చేసి రైతులను ముంచిండని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ రైతుబంధు రెండు పంటలకు ఇస్తే.. రేవంత్ మూడు పంటలకు రూ.15వేలు ఇస్తానని మోసం చేశాడని దుయ్యబట్టారు. నాటు వేసే సమయానికి కేసీఆర్ హయాంలో రైతుబంధు పడేదని, ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. 11సార్లు 90లక్షల మంది రైతులకు ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేశారని గుర్తుచేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల మీద ఒట్టేసి సీజన్‌కు రూ.15 వేలు ఇస్తానని, కౌలు రైతులకు కూడా ఇస్తానని రేవంత్ చెప్పాడని.. మరి ఇస్తున్నాడా? పడుతున్నాయా? అని ప్రశ్నించారు.
బంగారం ఇచ్చేటోళ్లు కాదు.. పుస్తెలతాడు ఎత్తుకుపోయే బ్యాచ్
‘కాంగ్రెసోళ్లు నమ్మదగిన వ్యక్తులు కాదని.. బంగారం ఇచ్చే మనుషులు కాదు.. పుస్తెలతాడు ఎత్తుకుపోయే బ్యాచ్’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇంటికే పంపిస్తా అని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డికి రెండేండ్లయినా బంగారం దొరుకుతలేదా అని ప్రశ్నించారు. బంగారు దుకాణాలు కనబడతలేవా? లేకపోతే దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా? అంటూ దుయ్యబట్టారు. తులం బంగారం ఇయ్యడానికే చేతకాదు కానీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట.. అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలంటూ ఎద్దేవా చేశారు. అలాగే విద్యాభరోసా కార్డు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూ దిక్కులేదని, రూ.12,500 కోట్లు ప్రైవేట్ కాలేజీలకు బకాయి ఉందని, టీసీలు రాక విద్యార్థులు ఆగమవుతున్నారని మండిపడ్డారు. మరి ఈ రెండేండ్లలో ఏ వర్గానికి లాభం జరిగిందో ఆలోచించాలని ప్రజలను కేటీఆర్ కోరారు.
‘పాలమూరు’ను పడావు పెట్టి
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను తెచ్చి ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొంతభాగం.. నల్లగొండ జిల్లాలో కొంత భాగం నీళ్లు ఇయ్యాలని ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ తెలిపారు. 14లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 90శాతం పూర్తిచేశారని పేర్కొన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేసి, నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 2023లో స్వయంగా పంపును కూడా ప్రారంభించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావున పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు పారించామని వివరించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పూర్తిచేసి ఈ జిల్లాలో ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైగ్రేషన్‌కు మారుపేరైన పాలమూరును.. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్‌కు మారు పేరుగా మార్చామని ఆయన గుర్తుచేశారు.
వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మా ఎమ్మెల్యేల దగ్గరనే పైసలు లేవు.. పెండ్లిళ్లు… పేరంటాలు తిరుగుడు తప్ప మాతో నే ఏమైతలేవ్ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖుల్లంఖుల్లా చెబుతున్నాడు. ఈ జిల్లాకు ఓ మంత్రి.. ఆయన ఆదిలాబాద్ పర్యటనలో నా దగ్గర పైసలు లేవు.. నేను హామీలు ఇయ్యను.. మళ్లీ గెలుస్తానో లేదో తెల్వదు. ప్రభుత్వం వస్తుందో? రాదో? కూడా తెలువదు’ అన్నాడని గుర్తుచేశారు. ఇప్పుడు ‘రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలకే ఇస్తలేడు, సర్పంచులకు ఇస్తడా? గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి.. ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను పండబెట్టి తొక్కుతరు
కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలే పండబెట్టి తొక్కుడు ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. 14 నియోజకవర్గాల్లో కొడంగల్ సహా ఈసారి కాంగ్రెస్‌ను బొందపెట్టబోతున్నారని చెప్పారు. ఈ జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది.. మళ్లీ కాంగ్రెస్‌ను దహించి వేస్తది అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఆంజనేయులుగౌడ్, ఇంతియాజ్ ఇసాక్, వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కేసీ నర్సింహులు, గంజి వెంకన్న, శివరాజ్, ఆంజనేయులు, సలీం తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి
పదేండ్ల కేసీఆర్ పాలనలో పల్లె, పట్నం అనే తేడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 2014కు ముందు, ఇప్పుడు ఎలా ఉన్నాయని అడిగారు. పల్లెల్లో కేసీఆర్ నాయకత్వంలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు, దారిపొడవునా చెట్లు, ఇంటింటికీ నల్లా, వీధుల్లో స్ట్రీట్ లైట్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్లు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా కొత్తగా చేసిందేమీ లేదని మండిపడ్డారు. రెండేండ్ల రేవంత్ పాలనలో ట్యాంకర్లల్లో నీళ్లు లేవు.. ట్రాక్టర్లలో పోసేందుకు డీజిల్ లేదు.. పైన పెట్టిన కరెంట్ బుగ్గలు వెలుగుత లేవంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కిట్టు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండి ఎక్కించుకొని దవాఖాన తీసుకపోయి.. మళ్లీ బిడ్డ పుట్టినంక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర, రంజాన్ పండుగ వస్తే, క్రిస్మస్ పండుగలకు కేసీఆర్ కానుక ఇచ్చేదని ఇప్పుడు వస్తున్నాయా అని అడిగారు. పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి.. ఒక అవకాశం ఇస్తే పింఛన్ రూ.4వేలు ఇస్తా అని రేవంత్‌రెడ్డి చెప్పి ముసలోళ్ల నోట్లో మట్టి కొట్టి పింఛన్లు ఇవ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మళ్లీ పాత రోజులు వచ్చాయి; మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కాంగ్రెస్ తెస్తానన్న పాత రోజులు మళ్లా వచ్చాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ హయాంలో రూ.వందల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. పాలమూరులో వెయ్యి పడకల దవాఖాన తీసుకువస్తే నిర్మాణం పూర్తయినా పరికరాలు కోసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో సర్కార్ ఉందని మండిపడ్డారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి మినీ ట్యాంక్‌బండ్ నిర్మిస్తే దాన్ని కూడా పూర్తి చేయకుండా ఆపేశారని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టినా పనులు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్కుబుద్ధి చెప్పండి ; మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
మోసపూరిత కాంగ్రెస్‌ను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలన చూడండి ; ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం గతి ఎలా తయారైందో చూడాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గ్యారెంటీల పేరుతో నమ్మకద్రోహం చేసిన పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.
చంద్రబాబుకు చెంచాగిరీ రేవంత్..
పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు పనులను పడావు పెట్టాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత బాస్‌కు కోపం రావద్దు… కేసీఆర్‌కు పేరు రావద్దు.. అని పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నడని ధ్వజమెత్తారు. మాట్లాడితే పాలమూరు బిడ్డను అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి.. ఈ రెండేండ్లలో పాలమూరు రైతుల కోసం ఒక్క మంచి పనైనా చేసిండా? అని ప్రశ్నించారు. యూరియా బస్తాలు ఇయ్యడం చేతకానోడు ఇవాళ పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని మళ్లీ మీ ముందుకు వస్తున్నాడని, ఎవరైనా ఒకసారి మోసపోతారని.. అన్నిసార్లు మోసపోతే వాళ్ల తప్పు కాదు.. మన తప్పు అయితది అని అన్నారు.
పాలమూరు నుంచే మార్పు మొదలైంది. అందుకు మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. రెండేండ్లు తిరగకుండానే పల్లెల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చింది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మార్పు కనిపిస్తది. ఎందుకంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నరు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి.. అడ్డగోలు హామీలు ఇచ్చారో అందరికీ తెలుసు.
– కేటీఆర్
రేవంత్‌రెడ్డీ.. 17న మహబూబ్‌నగర్‌కు వస్తున్నావు కదా. నేను ఒకటే సూటిగా అడుగుతున్న. ఆనాడు మేము ఐటీ హబ్ కట్టి.. అక్కడ 14 పరిశ్రమలను తెస్తే మీ ప్రభుత్వం వచ్చి తర్వాత అవి ఎందుకు పారిపోయినయో తెలంగాణ యువతకు, మహబూబ్‌నగర్ యువతకు సమాధానం చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినంక పాలమూరుకు ఒక్క పరిశ్రమైనా తెచ్చినవా? సమాధానం చెప్పు. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నావు.
– కేటీఆర్