మేడ్చల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. డీలిమిటేషన్‌పై కేంద్రం చెప్పిం ది ఒకటి.. నేటి నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో పెట్టే బిల్లు మరోటి అని, ఈ బిల్లులో 50 శాతం సీట్ల పెంపు లేనే లేదని విమర్శించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్లో చేరగా వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాడు 2014లో డీలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే ఉన్నదని, దాన్ని తుంగలో తొక్కిందే బీజేపీ అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు బీఆర్ఎస్ అనుకూలమని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తయినా ఆ పార్టీ ఇచ్చిన ఆషాఢం సేల్ బంపర్ ఆఫర్ హామీలు ఒక్కటీ అమలు చేయలేదని కేటీఆర్ దెప్పిపొడిచారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఊదర గొట్టే ప్రసంగాలు చేశారని, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు, మహిళా డిక్లరేషన్లు అంటూ డబ్బా కొట్టి అదనంగా 420 హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని అడ్డంపొడుగు మాటలు చెప్పి రేవంత్‌రెడ్డి సీఎం గద్దెమీద కూర్చున్నాడని దుయ్యబట్టారు. హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తం అని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బాకా ఊదిండ్రు. ఇప్పుడు హామీలు ఏమైనయ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నడు. లాగులో తొండలు ఇడుస్తానని చిల్లర మాట లు మాట్లాడుతున్నడు’ అని తూర్పారబట్టారు. హామీలను కాంగ్రెస్ అమలు చేయకపోగా కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి మొత్తం భూములను దోచుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పేరుతో గరిబోళ్ల ఇండ్లు కూలగొడుతూ మరో పక్క భూములన్నీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే అది కాంగ్రెస్ దొంగలు, దోమలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వల్ల నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ ఊపందుకున్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేశం పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కౌడ పోచయ్య, విద్యావేత్త ఆకుల మధుకర్, మరో 150 మంది బీఆర్ఎస్లో చేరారు.