KTR : కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్పినా ప్రజలు ఇందిరమ్మ రాజ్యం గురించి మర్చిపోయి ఓట్లేసిండ్రని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎమర్జెన్సీ రాజ్యమే నడుస్తోందని, సోషల్ మీడియాలో ఒక పోస్టుపెడితే పోలీసోడు ఫోన్ చేస్తున్నడని చెప్పారు. పోలీసోడు దొంగలవట్టుడు విడిచిపెట్టిండని, బీఆర్ఎస్ వాళ్ల వెంబడి పడుడే నేర్చుకున్నడని ఎద్దేవా చేశారు.
తాను మీ అందరికి ఒక్కటే మాట ఇస్తున్నానని, తాను కేసీఆర్ అంత మంచివాన్ని కానని, మళ్ల మన టైమ్ వస్తదని, బరాబర్ మన టైమ్ వస్తదని, వేధించేటోళ్ల పేర్లు రాసి పెట్టుండ్రని, అధికారంలోకి వచ్చినంక ఒక్కొక్కన్ని ఏంజేయాలో అది జేద్దామని అన్నారు. వదిలిపెట్టే సమస్యే లేదని చెప్పారు. ‘కొంతమంది మేం రిటైరైతం, ఇంటికి పోతం ఏంజేస్తరని అనుకుంటున్నరమో.. రిటైరైనా వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ జేస్తం. కితాబ్ మొత్తం చూస్తం.’ అని హెచ్చరించారు.
‘కేంద్రం డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జనాభా ధామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని అంటోంది. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను పెంచి, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గిస్తమంటోంది. నాడు భారత ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలు పాటించినయ్. ఈ రాష్ట్రాలతోపాటు ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్ లాంటి కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం మాట విన్నయ్. కానీ ఇప్పుడు కేంద్రం ఏంచేస్తనంటుంది. తన మాట విన్న రాష్ట్రాలకు అన్యాయం చేసి, మాట వినని యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మేలు చేస్తనంటోంది. ఇదెక్కడి న్యాయం. అందుకే నిన్న తమిళనాడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో సమావేశమైనం. కేంద్రం పోకడను అడ్డుకోవాలని నిర్ణయించినం.’ అని కేటీఆర్ చెప్పారు.